ఆర్బీఐ రెపోరేటు పెంపుతో బ్యాంకులు, ఆయా సంస్థల్లో తీసుకున్న గృహ రుణాలపై వడ్డీరేట్లూ పెరుగుతున్నాయి. దీంతో రుణగ్రహీతలపై పెనుభారమే పడుతున్నది. దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న అవకాశాలేంటో ఒక్కసారి చూస్తే..
హైబ్రిడ్ లోన్
కొత్తగా గృహ రుణం తీసుకోనున్నవారైతే హైబ్రిడ్ లోన్‌ను ఎంచుకోండి. కొన్నేండ్లపాటు ఇందులో వడ్డీరేట్లు (ఫిక్సడ్ రేటు) మారవు. ఆ తర్వాత మార్పు (ఫ్లోటింగ్ రేటు)నకు వీలుంటుంది.
పాత విధానమా..
2019 అక్టోబర్‌కు ముందు మీరు గృహ రుణాన్ని తీసుకున్నైట్టెతే వడ్డీరేటు విధానాన్ని పరిశీలించండి. పాత విధానమైతే.. కొత్త విధానంలోకి మార్చమని మీకు రుణమిచ్చిన సంస్థను అడగండి. మీరు అడిగేదాకా మారదు మరి. అప్పుడు కొంత ఫీజుతో వడ్డీరేటు విధానం మారుతుంది. కొత్త ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు విధానం రుణగ్రహీతలకు లాభదాయకం.
క్రెడిట్ స్కోర్
క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. కాబట్టి క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి. అలాగే ఇతర బ్యాంకులు, సంస్థల్లో వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో చూసుకొని, తక్కువ వడ్డీరేట్లు ఉన్న చోటికి రుణాన్ని మార్చుకుంటే లాభమా?.. అన్నదీ పరిశీలించండి.
కాలపరిమితి
వడ్డీరేట్ల పెరుగుదలతో ఈఎంఐ భారంగా మారితే.. ఈఎంఐకి బదులుగా రుణ కాలపరిమితిని పెంచమని మీకు రుణమిచ్చిన సంస్థకు విజ్ఞప్తి చేయండి. అలాగే మీవద్ద నగదుంటే రుణం అసలు మొత్తంలో కొంత తీర్చేయడానికి ప్రయత్నించండి.