హైదరాబాద్ ఆఫీస్‌లో నియమించుకోనున్న అమెరికా సంస్థ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): అమెరికా కేంద్రస్థానంగా టెక్నాలజీ సేవలు అందిస్తున్న ఇంటర్కాంటినెంటల్ ఎక్సేంజ్..భారత్‌లో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్, పుణెలలో కార్యాలయాలను ఏర్పాటు చేసిన సంస్థ..ప్రస్తుతం వీటిని మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. పుణెలో ఐసీఈ మార్ట్గేజ్ టెక్నాలజీ సేవలు అందిస్తున్న సంస్థ..ఈ తరహా సేవలను త్వరలో హైదరాబాద్‌లో ఆరంభించబోతున్నది.
ఇందుకోసం ఈ ఏడాది చివరినాటికి కొత్తగా 500 మంది సిబ్బందిని తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వీరిలో భాగ్యనగరం ఆఫీస్ కోసం 300 మందిని, పుణె కార్యాలయానికోసం 200 మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,500కి చేరుకోనున్నారు. 2019లో హైదరాబాద్‌లో 500 మంది ఉద్యోగులతో ఆఫీస్‌ను ప్రారంభించిన సంస్థ ఈ సంఖ్యను 900కి పెంచుకున్నది.