హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా మల్టీ బ్రాండ్ రెస్టారెంట్స్‌తో సేవలందిస్తున్న ఇన్స్పైర్ బ్రాండ్స్ సంస్థ.. హైదరాబాద్ నగరంలో కొత్త ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ సెంటర్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్స్పైర్ బ్రాండ్ సీఈవో, సహ వ్యస్థాపకులు పాల్ బ్రౌన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ 32 వేల మల్టీ బ్రాండ్ రెస్టారెంట్స్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. వాటికి సంబంధించిన సేవలను అందించేందుకు హైదరాబాద్ ఎంతో అనుకూలంగా ఉండటంతో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఇక్కడ ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం 100 మంది నిపుణులతో ప్రారంభమైన ఈ కేంద్రాన్ని.. త్వరలోనే 500 మందితో పనిచేసేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంఛైజీలకు సేవలు అందిస్తామని, ఇందులో ప్రధానంగా డాటా సైన్స్, ఎనలిటిక్స్, ఈ-కామర్స్, ఆటోమేషన్, క్లౌడ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వంటి కీలక అంశాల్లో సేవలుంటాయని వివరించారు. ఇక హైదరాబాద్ ఇన్నోవేషన్ ల్యాబ్.. స్థానిక స్టార్టప్‌లకు మంచి ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎన్ఎస్ఆర్ వ్యవస్థాపకులు సీఈవో లలిత్ అహుజా, కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.