న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ‘మూన్‌లైటింగ్’కు (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం) ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల్ని హెచ్చరించింది. ఉద్యోగపు కాంట్రాక్ట్ క్లాజుల్ని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, ‘ఇది ఎంప్లాయ్మెంట్ టెర్మినేషన్‌కు కూడా దారితీయవచ్చని’ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ‘నో టూ టైమింగ్-నో మూన్‌లైటింగ్’ అంటూ ఉద్యోగులకు పంపిన మెసేజ్‌లో పేర్కొంది. ఎంప్లాయీ హ్యాండ్‌బుక్, కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ద్వంద్వ ఉద్యోగాలకు అనుమతి లేదని అంటూ ఆఫర్ లెటర్లో సంబంధిత క్లాజ్‌లను ప్రస్తావించింది. ఈ క్లాజ్‌లను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సివస్తుందని, దీంతో ఉద్యోగంలోంచి తొలగించాల్సివస్తుందంటూ ఉద్యోగులకు పంపిన మెయిల్లో ఇన్ఫోసిస్ వివరించింది. మూన్‌లైటింగ్ ‘పరిణామాల్ని’ మేనేజర్లు వారి టీమ్స్‌కు తెలియచెప్పాలని, మూన్‌లైటింగ్ సందర్భాలేవైనా దృష్టిలోకి వస్తే తక్షణమే సంబంధిత యూనిట్ హెచ్ఆర్కు సమాచారమివ్వాలంటూ మేనేజర్లను ఇన్ఫోసిస్ కోరింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో వర్క్ ఫ్రం హోంను పలు కంపెనీలు అమలుచేయడంతో టెక్కీలు మూన్‌లైటింగ్ చేస్తున్నారన్న అంశం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మూన్‌లైటింగ్ అంటే చీట్ చేయడమేనంటూ విప్రో చైర్మన్ రిషాధ్ ప్రేమ్‌జీ తొలుత చర్చను లేవనెత్తారు. అయితే పరిశ్రమలో ఈ అంశమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు ఉద్యోగాలు ఎలా సాధ్యం: ఎంప్లాయీస్ యూనియన్
ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపించిన ‘బెదిరింపు ఈమెయిల్’ను పూనేకు చెందిన ఎంప్లాయీస్ యూనియన్ నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సేనేట్ (ఎన్ఐటీఈఎస్) తీవ్రంగా ఖండించింది. పలు కారణాల వల్ల మూన్‌లైటింగ్ సాధ్యం కాదని ఎన్ఐటీఈఎస్ వాదించింది. ఏ కంపెనీలో చేరడానికైనా ప్రస్తుతం ఆధార్, పాన్ కార్డ్‌లు తప్పనిసరి అని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ప్రభుత్వం కూడా ఆధార్‌తో లింక్ చేస్తున్నదని, ప్రావిడెంట్ ఫండ్‌కు ప్రతీ ఉద్యోగికీ ఒక ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఉంటుందని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా చెప్పారు. దీంతో ఒక నెలలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపుల్ని రెండు కంపెనీలు చేయడం సాధ్యం కాదన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగులు డెడ్‌లైన్స్‌ను చేరడానికి ఒత్తిడితో పనిచేస్తున్నారని, ఓవర్‌టైమ్ ప్రయోజనాలేవీ లేకుండా రోజుకు తొమ్మిది గంటలకు పైగా విధిని నిర్వహిస్తున్నారని, రోజుకు 10-12 గంటలు పనిచేసిన తర్వాత ఉద్యోగికి సమయంగానీ, పనిచేసే శక్తిగానీ ఉంటుందా అని ప్రశ్నించారు. ఉద్యోగి ఉత్పాదకతను కొలవడానికి ఐటీ కంపెనీలు మానిటరింగ్ సిస్టమ్స్‌ను కూడా అభివృద్ధిపర్చినట్టు యూనియన్ తెలిపింది. ఈ నేపథ్యంలో మూన్‌లైటింగ్‌పై బెదిరింపు ఈమెయిల్స్ ‘చట్ట విరుద్ధం..అనైతికం’ అం టూ విమర్శించింది. పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులు ఏమి చేస్తారన్నది వారి ఇష్టమని ఎన్ఐటీఈఎస్ పేర్కొంది.