Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’.. తన ఉద్యోగులకు తీపి కబురందించింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 85 శాతం వర్క్ బేస్డ్ బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించిన ఇన్ఫీ.. ఈ బోనస్ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నది. నవంబర్ నెలతోపాటు ఈ బోనస్ చెల్లించనున్నది. బోనస్ చెల్లింపు విషయమై సంబంధిత ఉద్యోగులకు ఇన్ఫీ యాజమాన్యం ఈ-మెయిల్స్ పంపింది. ద్వితీయ త్రైమాసికంలో మెరుగైన వృద్ధి నమోదు చేయడంలో ఉద్యోగుల సహాయ సహకారాలు మరువలేనివని తెలిపింది. ఉద్యోగులు ఇదే నిబద్ధతనూ మున్ముందూ కొనసాగించాలని కోరింది. ఇన్ఫీ నిర్ణయంతో సంస్థ డెలివరీ, సేల్స్ యూనిట్లలో పని చేసే మిడ్, జూనియర్ లెవల్ ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,506 కోట్ల నికర లాభం గడించినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అలాగే 5.1 శాతం వృద్ధితో రూ.40,986 కోట్ల ఆదాయం సముపార్జించినట్లు తెలిపింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలు కూడా 3.75-4.5 శాతంగా నమోదవుతుందని వెల్లడించింది. ఇన్ఫీ ఉద్యోగులను ఈ0 – ఈ2 క్యాటగిరీ, ఈ3-ఈ6, ఈ7 అంత కంటే పెద్ద క్యాటగిరీలుగా విభజించారు. ఇన్ఫీ ఉద్యోగుల్లో ఫ్రెషర్లు, టెక్నికల్ లీడర్లు, మిడ్ లెవల్ ఉద్యోగులు, సీనియర్ లెవల్ ఉద్యోగులు ఉంటారు.