న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపికబురును అందించింది. అసాధరణ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల వేతనాలను 20 శాతం వరకు పెంచబోతున్నది. ఐటీ రంగం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాలను పెంచబోతుండటం విశేషం.
సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించింది. వీరిలో కంపెనీ అంచనాలు అందుకున్నవారికి 5-7 శాతం వరకు, మెరుగైన పనితీరు కనబరిచిన వారికి 7-10 శాతం, అత్యత్తమ ప్రతిభ కనబరిచినవారికి 10-20 శాతం వరకు ఇంక్రిమెంట్లు అందించినట్లు తెలుస్తున్నది. వీరిలో 20 శాతం అందుకున్నవారు మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని తెలుస్తున్నది. పెరిగిన జీతభత్యాలు జనవరి 1 నుంచి వర్తించనున్నది.