Infosys | దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో అదరగొట్టింది. 2023-24తో పోలిస్తే 2024-25 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 11.46శాతం నికర లాభాలు పెంచుకున్నది. ఈ ఏడాది తృతీయ త్రైమాసికంలో రూ.6,806 కోట్ల కన్సాలిడెటేడ్ నికర లాభం గడించింది. 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో రూ.6,106 కోట్ల నికర లాభం మాత్రమే గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై -సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ.6,506కోట్ల నుంచి 4.6 శాతం పెంచుకున్నది.
2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 7.58 శాతం పెంచుకుని రూ.38,821 కోట్ల నుంచి రూ.41,764 కోట్లకు చేరుకున్నట్లు ఇన్ఫోసిస్ గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో రూ.40,986 కోట్లతో పోలిస్తే, రెవెన్యూలో 1.9శాతం మోస్తరు వృద్ధి సాధించింది. నిర్వహణ లాభాల్లో 21.3 శాతం వృద్ధిరేటును ఇన్పోసిస్ నమోదు చేసింది.
క్లయింట్లకు దగ్గర కావడంపై కేంద్రీకరించామని ఇన్ఫోసిస్ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ తెలిపారు. వైవిధ్యభరితమైన డిజిటల్ ఆపరింగ్స్తో విజయం సాధించగలమని చెప్పడానికి తమ ఆర్థిక ఫలితాలే నిదర్శనం అని చెప్పారు. సీజనల్‌గా బలహీన వాతావరణంలోనూ నిర్వహణలోనూ, లాభాల్లోనూ వృద్ధి సాధించామన్నారు. జనరేటివ్ ఏఐతోపాటు ఏఐ సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి సారించామన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీలో కొత్తగా 5,591 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,379 మందికి చేరుకున్నది.