న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ మరోసారి భారీ స్థాయి బైబ్యాక్‌ను ప్రకటించింది. రూ.18 వేల కోట్ల విలువైన షేర్ల తిరిగి కొనుగోలు ప్రక్రియకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ చరిత్రలో ఒకేసారి ఇంతటి స్థాయిలో బైబ్యాక్ ప్రకటించడం ఇదే తొలిసారి. రూ.5 ముఖ విలువ కలిగిన 2.41 శాతానికి సమానమైన 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి హస్తగతం చేసుకోనున్నది. ఒక్కో షేరుకు రూ.1,800 చెల్లించనున్నది. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి నమోదైన షేరు ధర కంటే 19 శాతం ఎక్కువకు కొనుగోలు చేయనున్నది. ఈ బైబ్యాక్ ప్రతిపాదనపై కంపెనీ బోర్డు సమావేశమై అనుమతినిచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరినాటికి కంపెనీ వద్ద 884 మిలియన్ డాలర్లు(రూ.7,805 కోట్లు) నగదు నిల్వలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని బైబ్యాక్ కోసం వినియోగించబోతున్నది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 1.51 శాతం నష్టపోయి రూ.1,509.50 వద్ద నిలిచింది. 2017లో సంస్థ తొలిసారిగా బైబ్యాక్‌ను ప్రకటించింది. మళ్లీ ఎనిమిదేండ్ల తర్వాత షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నది. అప్పట్లో 4.92 శాతానికి సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో షేరుకు రూ.1,150 చెల్లించి మొత్తంగా రూ.13 వేల కోట్ల నిధులను వెచ్చించింది.