న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశీయ ఐటీ దిగ్గజం నెలరోజుల్లోనే మరో పెద్ద డీల్‌ను సాధించింది. యూరప్‌లోని కన్వర్జ్డ్ వీడియో, బ్రాడ్‌బాండ్, కమ్యూనికేషన్ కంపెనీ లిబర్టీ గ్లోబల్, ఇన్ఫీలు కుదుర్చుకున్న 1.5 బిలియన్ యూరోలు (దాదాపు రూ.13,500 కోట్ల) లావాదేవీని మంగళవారం ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఈ డీల్‌లో భాగంగా లిబర్టీ గ్లోబల్‌కు ఐదేండ్లపాటు సర్వీసులు అందిస్తుంది. ఈ కాంట్రాక్టును తదుపరికాలంలో 8 ఏండ్లకు పొడిగిస్తే, డీల్ విలువ 2.3 బిలియన్ యూరోలకు చేరుతుంది.
ఇరు పార్టీలు తొలుత ఐదేండ్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి. 8 ఏండ్లకు పొడిగించే ఆప్షన్‌ను ఒప్పందంలో పొందుపర్చారు. ఈ ఒప్పందంలో భాగంగా 400 మంది లిబర్టీ గ్లోబల్ ఉద్యోగులు ఇన్ఫోసిస్‌లో చేరతారు. తమ క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీసు కొబాల్ట్ను ఉపయోగించి లిబర్టీ గ్లోబల్‌కు క్లౌడ్ ఫస్ట్ డిజిటల్ ఫౌండేషన్ కల్పిస్తామని, అలాగే తమ టొపాజ్ ఏఐ టెక్నాలజీతో లిబర్టీ వాణిజ్య సేవల్ని పెంపొందింపచేస్తామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వివరించారు.