Retail Inflation | ఎట్టకేలకు ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. 18 నెలల కనిష్టస్థాయి రికార్డు నమోదు చేసింది. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా రికార్డయింది. 2021 అక్టోబర్ తర్వాత కనిష్ట స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే ప్రథమం. 2021 అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా నమోదైంది. అయితే, ఏడాది కాలానికి పైగా ధరల ఒత్తిళ్లు నికరంగా కొనసాగుతున్నా, కొన్ని ఆహార వస్తువుల ధరల తగ్గుదల సానుకూలంగా మారింది. మార్చిలో ఇండస్ట్రీయల్ ఔట్ పుట్ (ఐపీపీ) ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. మార్చి ఐపీపీలో మాన్యుఫ్యాక్చరింగ్ గ్రోత్ మెరుగు పడగా, విద్యుత్ తయారీ రంగంలో ప్రతికూల ప్రగతి నమోదైంది.
శుక్రవారం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన నివేదిక ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా నమోదైంది. మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. మార్చి కంటే తక్కువగా ఏప్రిల్ లో రికార్డైన చిల్లర ద్రవ్యోల్బణం.. ఆరు శాతానికి లోపు ఉండాలన్న ఆర్బీఐ పరిమితికి లోబడి ఉంది. ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ మార్చి నుంచి ఏప్రిల్ నెలకు 4.8 నుంచి 3.8 శాతానికి పడిపోయింది. ప్రధానంగా కూరగాయల ధరలు తగ్గడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపినట్లు తెలుస్తున్నది.
అర్బన్ ద్రవ్యోల్బణం అధికంగా 4.9 శాతం నమోదైతే, గ్రామీణ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా రికార్డైంది. తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, దుస్తులు, పాదరక్షల ఒత్తిళ్లు కొనసాగుతున్నా, పలు ఆహార ఉత్పత్తులు, ఇతర వస్తువుల ధరలు కాస్త తగ్గిపోయాయి. ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత స్థాయి కంటే తక్కువగా నమోదు కావడంతో వచ్చేనెలలో జరుగనున్న ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్ల పెంపుపై ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవచ్చు. వర్షాకాలంలో వర్షాలు, వాతావరణంపై ఎల్ నినో ప్రభావాన్ని బట్టి మున్ముందు రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది.