న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : పారిశ్రామిక రంగానికి మళ్లీ బ్రేకులుపడ్డాయి. గనులు, తయారీ రంగంలో నెలకొన్న స్తబ్దత కారణంగా గత నెలకుగాను పారిశ్రామిక రంగంలో వృద్ధి మూడు నెలల కనిష్ఠ స్థాయి 4 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 3.1 శాతంతో పోలిస్తే పెరిగినప్పటికీ వరుస నెలల్లో నమోదైన వృద్ధితో పోలిస్తే భారీగా పడిపోయింది. గత మూడు నెలల్లో ఇంత తక్కువగా వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. కేంద్ర గణాంకాల శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. గనులు రంగంలో వృద్ధి మైనస్ 0.4 శాతానికి పడిపోగా, తయారీ రంగం కాస్త పుంజుకున్నప్పటికీ మొత్తం పారిశ్రామిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే ఆగస్టు నెల పారిశ్రామిక గణాంకాలను 4 శాతం నుంచి 4.1 శాతానికి సవరించింది కేంద్ర ప్రభుత్వం.
సెప్టెంబర్ నెలలో వెల్లడైన తాజా గణాంకాలు.. దేశీయ డిమాండ్ తగ్గడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతోపాటు, రంగాలకు సంబంధించిన సవాళ్ల మధ్య పారిశ్రామిక కార్యకలాపాల్లో నిస్తేజం నెలకొన్నదని పేర్కొంది. దేశీయ పారిశ్రామిక ప్రగతిలో 78 శాతం వాటా కలిగిన తయారీ రంగం 4.8 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. అలాగే ఆగస్టు నెలలో ఇది 3.8 శాతంగా ఉన్నది. గనుల రంగంలో వృద్ధి -0.4 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో 0.2 శాతంగావున్న వృద్ధి, ఈ ఏడాది ఆగస్టులో 6.6 శాతంగా నమోదైంది. ఆ మరుసటి నెలలో ప్రతికూలానికి పడిపోవడం విశేషం. దేశవ్యాప్తంగా ఆకాల వర్షాలు కురియడం వల్లనే వృద్ధి జారుకున్నదని కేంద్రం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్/నిర్మాణ రంగ పరికరాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాలు ఆశాజనక పనితీరు కనబరిచాయి. కానీ, ప్రైమరీ గూడ్స్, కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ మాత్రం ప్రతికూలానికి పడిపోయాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మసకబారిన పారిశ్రామిక ప్రగతి అటు రెండో త్రైమాసికంలోనూ అంతంత మాత్రంగానే నమోదు చేసుకున్నది. మొత్తంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో పారిశ్రామిక వృద్ధి 3 శాతానికి పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన 4.1 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయింది.