IT Industry | బెంగళూరు, మార్చి 22: భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కష్టాలేనన్న అభిప్రాయాలు పరిశ్రమ విశ్లేషకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా పేలవమైన ప్రదర్శనను ఇచ్చిన రంగాల్లో ఐటీ రంగం కూడా ఒకటిగా ఉన్నది. ఈ క్రమం లో ఇండస్ట్రీ అనలిస్టుల అంచనాలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ త్రైమాసిక నివేదిక కూడా ఆ అంచనాలకు బలం చేకూరుస్తున్నది. తాజాగా విడుదలైన ఈ రిపోర్టులో ఐటీ కంపెనీల కస్టమర్లు వ్యయ నియంత్రణ దిశగా వెళ్తున్నారని, దీంతో మున్ముందు ఐటీ ప్రాజెక్టులకు డిమాండ్ అంతంతేనని యాక్సెంచర్ పేర్కొన్నది మరి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా భావించే అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. ఎన్నో అంచనాల నడుమ అధ్యక్ష పీఠం ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు అంతటా వినిపిస్తుండటం గమనార్హం. ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలకు పట్టుబడుతున్న ట్రంప్.. అందుకు డెడ్‌లైన్ కూడా పెట్టుకున్నారు. వచ్చే నెల నుంచి భారత్, చైనాసహా ఐరోపా, ఇతర దేశాలపై అధిక సుంకాలుంటాయని ఇప్పటికే తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఇది అమెరికా జీడీపీలో మందగమనానికి దారితీస్తున్నది. ట్రంప్ చర్యలతో అమెరికాలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తుల ధరలు పెరుగుతాయన్న గుబులు అక్కడివారిలో పట్టుకున్నది. ఈ పరిణామం మార్కెట్లో కొనుగోలు శక్తిని బలహీనపరుస్తుండగా.. కంపెనీల పెట్టుబడులు, ఖర్చులనూ పునరాలోచనలో పడేస్తున్నది. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయంలో మెజారిటీ వాటా అమెరికా మార్కెట్ నుంచే వస్తుందన్న సంగతి విదితమే. దీంతో అక్కడి క్లయింట్లు తమ బడ్జెట్‌ను తగ్గిస్తుండటం.. ఇండియన్ ఐటీ సంస్థల కొత్త ప్రాజెక్టులను దెబ్బతీస్తున్నది. యాక్సెంచర్ తాజా నివేదికలోనూ ఇవే సంకేతాలున్నాయి.
ఆదాయానికి తగ్గట్టు ఐటీ కంపెనీలు తమ ఖర్చులనూ తగ్గించుకునే పనిలో పడుతున్నాయి. ఇప్పటికే కొత్త నియామకాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న ఆయా సంస్థలు.. అమెరికా, ఐరోపా మార్కెట్లలో వ్యాపారం తగ్గిపోతే ఉన్న ఉద్యోగులనూ తొలగించేస్తాయన్న అంచనాలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి. ఈ ఏడాదిలో భారతీయ ఐటీ సూచీ 15.3 శాతం పడిపోవడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. 2022 జూన్ నుంచి ఇదే అత్యంత ప్రతికూల త్రైమాసికమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్ వంటి అగ్రశ్రేణి కంపెనీలపై అమెరికా పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. అమెరికా వీసా నిబంధనల కఠినతరం కూడా ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నది. బలపడుతున్న రూపీ కూడా ఐటీ లాభాలకు గండి కొడుతున్నది. మొత్తానికి వచ్చే ఏడాది కాలం ఐటీ సంస్థలకు గడ్డు కాలమేననిపిస్తున్నది.
నెమ్మదించిన రికవరీ, మితంగానే వృద్ధి
అయోమయంలో ఐటీ కంపెనీలు
స్టాక్ మార్కెట్ ప్రభావం
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు
వచ్చే ఏడాది మార్చిదాకా నిరాశే