న్యూఢిల్లీ : పండగ సీజన్ నేపధ్యంలో కస్టమర్లకు ఇండస్ఇండ్ బ్యాంక్ తీపికబురు అందించింది. డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని బ్యాంక్ లాంఛ్ చేసింది. దీంతో అధిక మొత్తం వెచ్చించి లావాదేవీలు జరిపే కస్టమర్లు వాటిని సులభ వాయిదాల్లోకి మార్చుకునే అవకాశం కలుగుతుంది. బ్యాంక్ డెబిట్‌కార్డు ఉన్న వారు నేరుగా ఆయా షాపులు, దుకాణాల్లో తమ కార్డును మర్చంట్ పీఓఎస్ టెర్మినల్ వద్ద స్వైప్ చేయడం ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు.
కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభూతిని అందించడంలో ముందుండే తాము తమ డెబిట్కార్డుదారులకు ఇప్పుడు ఈఎంఐ సౌకర్యాన్ని లాంఛ్ చేశామని, దీంతో నిర్ణీత వ్యవధిలో సులభ వాయిదాల ద్వారా కస్టమర్లు చెల్లింపులు చేపట్టవచ్చని ఇండస్ఇండ్ బ్యాంక్ చీఫ్ డిజిటల్ అధికారి చారు మాధుర్ తెలిపారు. భారీ రిటైలర్లు, హైపర్మార్కెట్లు సహా 60,000 ఆఫ్‌లైన్ మర్చంట్ అవుట్లెట్లతో ఇండస్ఇండ్ బ్యాంక్ భాగస్వామ్యం ఉందని చెప్పారు. ఇక బ్యాంకు డెబిట్‌కార్డుదారులు తాము కొనుగోలు చేసిన వస్తువులు, ఉత్పత్తులను ఈ సౌకర్యం వినియోగించుకుని 3,6,9,12,18,24 నెలల్లో సులభ వాయిదాల ద్వారా చెల్లింపులను చేపట్టవచ్చని బ్యాంక్ పేర్కొంది.