హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : దేశ సరిహద్దుల్లో గస్తీ, శత్రు డ్రోన్ల కూల్చివేత కోసం అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ‘ఇంద్రజాల్’ రేంజర్ యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌కు చెందిన ఆంత్రప్రెన్యూర్ కిరణ్ రాజు రూపొందించిన ఈ డ్రోన్ విధ్వంసక వాహనాన్ని ఇటీవల రాయదుర్గంలోని ‘టీహబ్’లో భారత ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే అట్టహాసంగా ఆవిష్కరించారు. ఏఐ సాంకేతికతతో 10 కి.మీ. పరిధిలోని డ్రోన్లను గుర్తించడంతోపాటు 4 కి.మీ. పరిధిలోని ప్రత్యుర్థుల డ్రోన్లను హ్యాక్ చేయగలిగేలా రూపొందించిన ‘ఇంద్రజాల్’ రేంజర్ ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ట్రయల్స్‌లో పాల్గొన్నదని, పలు శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేసిందని కిరణ్ రాజు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ఆలోచనలకు ఊపిరి పోయాలన్న సంకల్పంతో స్టార్టప్‌లను ప్రోత్సహించడం, మార్కెట్‌ను ఆకర్షించాలన్న ధ్యేయంతో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా లాంచ్ప్యాడ్లను ఏర్పాటు చేయడం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ఐటీ గమ్యస్థానంలా మార్చాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో టీహబ్‌తోపాటు వీ-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీవర్క్స్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్ పురుడుపోసుకున్నాయి. అంకుర సంస్థలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన టీహబ్ ద్వారా రాష్ట్రంలో 2 వేల స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూరింది. ఇక్కడి స్టార్టప్‌లకు 1.94 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి.