న్యూఢిల్లీ, జూన్ 19: దేశీయ విమానయాన రంగంలో మార్కెట్ లీడర్ అయిన ఇండిగో రికార్డుస్థాయిలో 500 ఎయిర్‌బస్ ఏ320 విమానాలకు ఆర్డరు చేసింది. టాటా గ్రూప్ నుంచి పోటీ ఏర్పడనున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ఇండిగో నడుంకట్టింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బస్‌కు ఇప్పటివరకూ ఏ ఎయిర్‌లైన్ కొనుగోలు చేయనంత భారీ ఆర్డరు ఇచ్చినట్టు ఇండిగో సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023 ఏప్రిల్‌నాటికి దేశీయ మార్కెట్లో ఈ సంస్థకు 57.5 శాతం వాటా ఉంది. ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీ 2030 నుంచి 2035 మధ్యలో ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది. ఈ ఆర్డర్ అధికారిక విలువ 55 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.50 లక్షల కోట్లు) కాగా, వాస్తవ విక్రయ ధర సాధారణంగా ఇంతకంటే తక్కువ ఉంటుంది. వాస్తవ ధర ఎంతన్నదీ వెల్లడికాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత భారత్ నుంచి విమాన తయారీ సంస్థలకు వెళ్లిన రెండో పెద్ద డీల్ ఇది. ఫిబ్రవరిలో టాటా కంపెనీ ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్, బోయింగ్‌లకు 470 విమానాల తయారీ ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డరు విలువ 80 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.55 లక్షల కోట్లు). అంతర్జాతీయంగా అతిపెద్ద విమాన తయారీ కంపెనీలైన బోయింగ్ యూఎస్ కంపెనీకాగా, ఎయిర్‌బస్ ఫ్రాన్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.