Indigo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొత్తగా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఇసిడ్రో పార్కేరస్ను నియమించింది. ఈ ఏడాది చివరిలో రిటైర్ కానున్న వూల్ఫ్ గాంగ్ ప్రోక్ స్కౌర్ స్థానంలో ఇసిడ్రో పార్కేరస్ను నియమించినట్లు గురువారం తెలిపింది. రెగ్యులేటరీ అనుమతుల తర్వాత ఇసిడ్రో పార్కేరస్ నియామకం నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇసిడ్రో పార్కేరస్కు పౌర విమానయాన రంగంలో ఆపరేషన్స్, కమర్షియల్, వ్యూహం, ఆర్థికాంశాల్లో 25 ఏండ్ల అనుభవం ఉంది. గత ఏప్రిల్ లో ఇండిగోలో చేరారు. అప్పటి నుంచి ఇండిగో చీఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్గా పని చేస్తున్నారు. ఇండిగోలో చేరడానికి ముందు ఇసిడ్రో పార్కేరస్.. యూరోపియన్ విమానయాన సంస్థ వోలోటీ సీఓఓగా పని చేశారు. అంతకు ముందు మెకెన్సీ, ఉరాలిటా సంస్థల్లో పని చేశారని ఇండిగో తెలిపింది.
ప్రస్తుతం ఇండిగో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పని చేస్తున్న ప్రోక్ స్కావేర్ ఏడేండ్లుగా సేవలందిస్తున్నారు. 2018లో ఇండిగోలో చేరడానికి ముందు ప్రస్తుతం నేలకు పరిమితమైన గోఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్గా 2017 డిసెంబర్ లో వైదొలిగారు. భారత్ పౌర విమానయాన రంగంలో ప్రోక్ స్కావేర్ 15 ఏండ్ల అనుబంధం కలిగి ఉన్నారు. ఇండిగో సుస్థిర వృద్ధిలో ప్రోక్ స్కావేర్ కీలక పాత్ర పోషించారని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు.