న్యూఢిల్లీ, జూలై 13 : రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. ధరల కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెట్టుకున్న మధ్యస్త లక్ష్యం 4 శాతాన్ని మించి గత నెలలో నమోదైంది. జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.38 శాతంగా ఉన్నట్టు సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల్లో తేలింది. ఈ ఏడాది ఆరంభం నుంచేగాక, కొత్తగా వచ్చిన సిరీస్‌లోనూ గరిష్ఠ స్థాయి ఇదే కావడం గమనార్హం. అంతకుముందు నెల మేలో 3.93 శాతంగా ఉన్నది.
ఆహారోత్పత్తుల రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహార ద్రవ్యోల్బణం సూచీ జూన్‌లో 5.32 శాతంగా నమోదైంది. మే నెలలో 4.78 శాతంగా ఉన్నది. కాగా, అల్లం, టమాటా, కిస్మిస్ ధరలు విపరీతమైపోయాయని తేలింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.74 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 3.92 శాతంగా ఉన్నట్టు ఎన్ఎస్వో ఈ సందర్భంగా వివరించింది. అలాగే రాష్ర్టాలవారీగా తెలంగాణలో ద్రవ్యోల్బణం అత్యధికం (6.36 శాతం)గా, మిజోరాంలో అత్యల్పం (1.63 శాతం)గా ఉన్నట్టు పేర్కొన్నది. కాగా, ఎల్ నినో కారణంగా వర్షాలు దేశవ్యాప్తంగా విస్తారంగా కురువడం లేదు. దీంతో ఈసారి పంట దిగుబడులు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాల్లో వర్షాలు సమృద్ధిగా కురువకపోతే ఆహార ద్రవ్యోల్బణం కట్టడి దాదాపు అసాధ్యమేనని వ్యవసాయ రంగ నిపుణులు చెప్తుండటం ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తున్నది. అసలే పశ్చిమాసియా సంక్షోభం వల్ల భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదని, ఇప్పుడు వర్షాభావ పరిస్థితులతో ఎకానమీ ఇంకా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతంలోపే ఉంచాలన్నది ఆర్బీఐ లక్ష్యం. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 6 శాతాన్ని మించకుండా చూడాలన్నదే సెంట్రల్ బ్యాంక్ ధ్యేయం. అయితే ఇప్పుడు ఆర్బీఐ టార్గెట్‌ను మించి జూన్ నెల ధరల సూచీ నమోదైంది. దీంతో రాబోయే ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీరేట్ల పెంపు ఉండవచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరుగబోతున్నది. ఈ సందర్భంగా రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచే వీలుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ప్రియం కానున్నాయి. ఆయా రుణాలను తీసుకున్నవారిపై, తీసుకోవాలనుకునేవారిపై వడ్డీ భారం పెరుగుతుంది. అంతేగాక ఆటో, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాల వ్యాపారం కూడా ప్రభావం కాగలదు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా సంక్షోభం వేళ ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచితే.. దేశ జీడీపీ వృద్ధిరేటు దెబ్బ తింటుందన్న ఆందోళనలూ కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతున్నది చూస్తూనే ఉన్నాం. సరుకు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధిలో అలజడులు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్ని పెంచేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు, ఇరాన్ తమ పొరుగు దేశాలపై ప్రతిదాడులతో ఇప్పట్లో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేలా లేవు. ఈ నేపథ్యంలో దిగుమతుల ద్వారానే దాదాపు 90 శాతం ఇంధన అవసరాలను తీర్చుకుంటున్న భారత్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. పెట్రో ధరలు ఇంకా పెరిగితే ద్రవ్యోల్బణం రాబోయే నెలల్లో మరింత పెరిగే సంకేతాలే కనిపిసున్నాయని అంటున్నారంతా.
తెలంగాణలో అధిక ధరలు వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జాతీయ ద్రవ్యోల్బణం గణాంకాలను మించి రాష్ట్రంలో నమోదవుతున్నాయి. నిజానికి గత కొంతకాలంగా పరిస్థితి ఇలాగే ఉంటున్నది. జూన్‌లోనూ దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం రికాైర్డెంది. గత న్లైతే ఏకంగా 6.36 శాతంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ తాజా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. పైగా గడిచిన 3 నెలలుగా నెలనెలా ద్రవ్యోల్బణం రేటు పెరుగుతూనే ఉన్నది. ఇక ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన ద్రవ్యోల్బణం గణాంకాలే రాష్ర్టాలవారీగా చూసినైట్టెతే టాప్‌లో ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఆహారోత్పత్తుల ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఫలితంగా పేద, సగటు మధ్య తరగతి కుటుంబాల వంటింటి బడ్జెట్ తలకిందులైపోతున్నది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు కిలో రూ.60-120 స్థాయిలో ఉన్నాయి మరి. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, ఇతర ఆహారోత్పత్తుల పరిస్థితీ ఇలాగే ఉన్నది. దీంతో ధరల అదుపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
