Crude Oil | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతి బిల్లు రెట్టింపు కానున్నది. వచ్చే నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు బిల్లు 10 వేల కోట్ల అమెరికన్ డాలర్లను దాటనున్నది. ఇటీవల ముడి చమురు ధర పెరగడమే దీనికి కారణమని తెలుస్తున్నది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు క్రూడాయిల్ దిగుమతి కోసం 94.3 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధీనంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) నివేదిక పేర్కొన్నది.
చమురు ధరలు పెరగడంతో కేవలం గత నెలలోనే 1160 కోట్ల ఖర్చయ్యాయి. 2021 జనవరిలో కేవలం 770 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లు దాటడంతో మార్చితో ముగిసే నాటికి మొత్తం పెట్రోలియం పద్దు 110-115 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పీపీఏసీ అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 196.5 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి కోసం భారత్ 62.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.