Mahindra 5-Door Thar | మారుతి సుజుకి, ఫోర్స్ వంటి సంస్థలు పోటీ పడుతున్నా, ఆఫ్ రోడర్స్ ఎస్యూవీ కార్ల తయారీలో మహీంద్రా అండ్ మహీంద్రా అత్యంత పాపులర్ నిలిచింది. మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గురఖా వంటి కార్లు మార్కెట్లో ఉన్నా మహీంద్రా థార్ మోడల్ కారు దేశీయ మార్కెట్లో అత్యంత పాపులర్. ప్రస్తుతం 3-డోర్ అవతార్‌లో థార్ కార్లు విక్రయిస్తూ దూసుకెళ్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో 5-డోర్ థార్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
2023-24లో 65,246 యూనిట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో 17,286 యూనిట్ల 3-డోర్ థార్ కార్లు అమ్ముడయ్యాయి. ఆఫ్-రోడ్ ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో దేశంలో అత్యంత పాపులర్ కార్లలో మహీంద్రా థార్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా తన స్థానాన్ని మరింత పదిల పర్చుకునేందుకు ఆగస్టు 15న తన మహీంద్రా 5-డోర్ థార్ కారును ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకూ వచ్చిన సమాచారం మేరకు మహీంద్రా 5-డోర్ థార్ కారు న్యూ సిక్స్-స్లాట్ డబుల్ స్టాక్డ్ గ్రిల్లె, ఎల్ఈడీ ప్రొజెక్టర్ సెటప్‌తో సర్క్యులర్ హెడ్ ల్యాంప్స్, సీ-సేప్డ్ డీఆర్ఎల్స్, 360 డిగ్రీ కెమెరా సెటప్, డోర్ ఫ్రేమ్ మీద రేర్ డోర్ హ్యాండిల్ తదితర ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.
5-డోర్ థార్ కారు క్యాబిన్లో 10.25 అంగుళాల డ్యుయల్ డిస్ ప్లేస్ ఉంటాయి. వాటిలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మరొకటి ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ గా వస్తున్నాయి. ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ700 మోడల్ కార్ల మాదిరిగా పనోరమిక్ సన్ రూఫ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) సిస్టమ్ ఉంటాయి. 5-డోర్ థార్ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు. వాటిల్లో ఒకటి 1.5 లీటర్ల డీ117 సీఆర్డీఈ డీజిల్, 2.2 లీటర్ల ఎంహవాక్ 130 సీఆర్డీఈ డీజిల్, 2.0 లీటర్ల ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్లు ఉంటాయి. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉంటాయని తెలుస్తోంది. మహీంద్రా థార్ 5-డోర్ యూనిట్ ధర రూ.12.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆఫ్ రోడ్ ఎస్యూవీ కార్లలో మారుతి జిమ్నీ, ఫోర్స్ గుర్ఖా కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.