Exports | న్యూఢిల్లీ, నవంబర్ 14: దేశీయ వాణిజ్య ఎగుమతులు గత నెల అక్టోబర్లో నిరుడుతో పోల్చితే 17.25 శాతం పెరిగి రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 39.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే వాణిజ్య లోటు కూడా 27.14 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. సెప్టెంబర్లో ఇది 20.78 బిలియన్ డాలర్లే. ఎగుమతులు-దిగుమతుల మధ్యగల వ్యత్యాసాన్నే వాణిజ్య లోటు అంటారన్న విషయం తెలిసిందే.
గురువారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత నెలలో దేశంలోకి వచ్చిన దిగుమతుల విలువ 66.34 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే నెలతో చూస్తే 3.9 శాతం ఎక్కువ. కాగా, ముడి చమురు దిగుమతులు 13.34 శాతం పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.
మరోవైపు ఏప్రిల్-అక్టోబర్లో చైనా దిగుమతులు 65.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడుతో పోల్చితే 9.8 శాతం పెరగడం గమనార్హం. మరోవైపు ఇదే సమయంలో చైనాకు భారతీయ ఎగుమతులు 9.37 శాతం పడిపోయి 8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే అమెరికాకు 6.31 శాతం ఎగిసి 47.24 బిలియన్ డాలర్లకు పెరిగాయి.