Manufacturing | న్యూఢిల్లీ, మార్చి 3 : దేశంలో తయారీ రంగ వృద్ధిరేటు గత నెల 14 నెలల కనిష్ఠాన్ని తాకింది. ఫిబ్రవరిలో 56.3గానే నమోదైంది. అంతకుముందు నెల జనవరిలో ఇది 57.7గా ఉండగా.. నెల రోజుల్లోనే 1.4 మేర దిగజారిపోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్, నవంబర్ నెలల్లోనూ 56.4, 56.5గా ఉన్నది. ఈ క్రమంలోనే 2023 డిసెంబర్ తర్వాత తొలిసారి ఏడాదికిపైగా కనిష్ఠ స్థాయికి పడిపోయినైట్టెంది. సోమవారం హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సర్వే వచ్చింది. కొత్త ఆర్డర్లు అంతంతమాత్రంగానే ఉండటం, ఇందుకు తగ్గట్టుగా ఉత్పత్తీ మందగించిపోవడం.. పీఎంఐ సూచీని మరింత తగ్గేలా చేసిందని హెచ్ఎస్బీసీ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.
గత నెల ఎగుమతులకు సంబంధించి ఆర్డర్లు పెరిగినా.. అవి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, తయారీ రంగాన్ని ఉత్సాహపర్చలేకపోయాయని తాజా గణాంకాలనుబట్టి తెలుస్తున్నది. ముఖ్యంగా మార్కెట్లో అమ్మకాలు పడిపోవడం.. ఉత్పాదకతను దెబ్బతీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ను దేశీయ తయారీ రంగ సంస్థలు అందిపుచ్చుకోలేకపోతున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అయితే ఉత్పాదక సామర్థ్యం పెంపు, నాణ్యత వంటి వాటిపై దృష్టిపెట్టి.. వాటికనుగుణంగా పెట్టుబడులను సమకూర్చుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చన్న సూచనలు నిపుణుల నుంచి వస్తున్నాయి.
ద్రవ్యోల్బణం పెరగడం కూడా ఉత్పత్తి, అమ్మకాలను ప్రభావితం చేస్తున్నది. వస్తు, సేవల ధరలు అధికంగా ఉంటే కొనుగోలుదారులు సహజంగానే వెనకడుగు వేస్తారని, కాబట్టి ధరలు అదుపులో ఉన్నప్పుడే వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని మార్కెట్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం అటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణం, ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ కూడా విజృంభిస్తున్నాయి. ఫలితంగా ఆహార, ఆహారేతర వస్తూత్పత్తుల ధరలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో అమ్మకాలు క్షీణించి, ఉత్పాదకత కూడా దిగాలుపడుతున్నది.
భారత జీడీపీలో ఒక్క తయారీ రంగం వాటానే 17 శాతం వరకు ఉంటుంది. కాబట్టి తయారీ రంగం పరుగులు పెడితే.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఉరకలెత్తుతుంది. అయితే ప్రభుత్వాల నుంచి అరకొర సాయం, పెరిగే విదేశీ దిగుమతులు, పెట్టుబడుల కొరత, నైపుణ్య-సాంకేతిక లేమి, రుణ లభ్యత అంతంతే ఉండటం వంటివి.. తయారీ రంగాన్ని కుదేలు చేస్తున్నాయన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. నిజానికి దేశ ఉద్యోగావకాశాల్లోనూ ఉత్పాదక రంగం పనితీరు స్పష్టంగా కనిపిస్తుంది. కనుక తయారీ రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అప్పుడే దేశ ఆర్థిక వృద్ధికి పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరగలవని అంతా అంటున్నారు.