Homes 2024 | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం.. విశాలమైన ఇంటి కోసం తహతహలాడారు. కానీ, 2020 తర్వాత తొలిసారి ఇండ్ల విక్రయాలు పడిపోయాయి. ఇండ్ల ధరలు, రుణ ఖర్చులు పెరిగిపోవడం దీనికి కారణం అని చెబుతున్నారు. సానుకూల పరిస్థితులతో డిమాండ్ తిరిగి పుంజుకోవడానికి యూనియన్ బడ్జెట్లో ఏమైనా అవకాశాలు లభిస్తాయా? అని రియల్ ఎస్టేట్ నిపుణులు, సంస్థలు ఎదురు చూస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత వరుసగా మూడేండ్లు దూసుకెళ్లిన ఇండ్ల విక్రయాల్లో 2024లో డీ గ్రోత్ (De-Growth) నమోదు కావడం తొలిసారి. గతేడాదితో పోలిస్తే అధిక బేస్ ధరలు పలుకడంతో ఇండ్ల సరఫరా తగ్గిపోయింది.
భారత్ రెసిడెన్షియల్ మార్కెట్లో 2024లో మిశ్రమ ధోరణి నెలకొందని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ చైర్మన్ అనూజ్ పూరీ చెప్పారు. చౌక ఇండ్లకు గిరాకీ బలహీనంగా ఉంటే, లగ్జరీ ఇండ్ల ఆవిష్కరణలూ విక్రయాలు బలంగా ఉన్నాయన్నారు. భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 300 బిలియన్ డాలర్లు ఉంటుంది. 2023తో పోలిస్తే 2024 ఇండ్ల విక్రయాలు- రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నాలుగు శాతం పడిపోయిందని అనరాక్ తెలిపింది. 2020లో కరోనా మహమ్మారి వేళ ఇండ్ల విక్రయాలు 47 శాతం తగ్గాయి. తిరిగి 2021లో 71 శాతం, 2022లో 54, 2023లో 31 శాతం ఇండ్ల విక్రయాలు పుంజుకున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఆల్ట్రా సంపన్నులు లగ్జరీ ఇండ్లు, విల్లాలు, పెంట్ హౌస్ లను సొంతం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వల్ల ఇండ్ల విక్రయాలు కొంత తగ్గిన మాట నిజమేనని అనరాక్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కానీ 2023లో కొత్త వెంచర్ల ప్రారంభం, ఇండ్ల విక్రయాలు జీవిత కాల గరిష్టానికి దూసుకెళితే, కొన్ని సెగ్మెంట్లలో 2024లో ఇండ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయన్నారు. 2025లో ఇండ్ల మార్కెట్ స్థిరంగా కొనసాగుతుందని అనూజ్ పూరీ అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే 21 శాతం ఇండ్ల ధరలు పెరిగితే, ఈ ఏడాది యధాతథంగా కొనసాగుతాయని వ్యాఖ్యానించారు. అయితే, యూనియన్ బడ్జెట్ రూపురేఖలపైనే ఇది ఆధార పడుతుందన్నారు. అయితే, మధ్యతరగతి, స్వల్పాదాయ కుటుంబాల వారు సొంతింటి కల సాకారం చేసుకోవాలంటే ఇండ్ల రుణాలపై చెల్లిస్తున్న వడ్డీపై ఆదాయం పన్ను మినహాయింపు పెంచాలని రియల్ ఎస్టేట్ డెవలపర్లు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు. లగ్జరీ, ఆల్ట్రా లగ్జరీ ఇండ్ల విక్రయాలకు ద్రవ్య మద్దతు అవసరం లేదు. గురు గ్రామ్ లో సుమారు 400 యూనిట్లతో కూడిన ‘దీ దాహ్లియాస్’ అనే ఇండ్ల విలువ రూ.26 వేల కోట్లు. లగ్జరీ ఇండ్ల వెంచర్లు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అమ్ముడై పోవడం 2024లో సర్వ సాధారణంగా మారింది.
‘భారత్ రియల్ ఎస్టేట్ రంగంలో 2024 మరో మాన్యుమెంటల్ ఇయర్‌గా మిగిలిపోనున్నది. అద్దె ఇండ్లలో ఉండటం కంటే ప్రజలు సొంతిండ్లలో ఉండటానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు’ క్రెడాయ్ నేఝనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ చెప్పారు. పలు విదేశీ కంపెనీలు ప్రత్యేకించి టెక్నాలజీ సంస్థలు భారత్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తలపోస్తున్నాయి. భారత్ లో రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా ఉండటంతోపాటు వృత్తి నిపుణులు గణనీయంగా ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు.
‘ప్రస్తుతం ప్రతిదీ ఖర్చు పెరిగిపోయిన తరుణంలో చౌక ఇండ్ల విధానం నిర్వచనం పున:నిర్వరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ బెనిఫిట్లను విస్తరించాలి’ అని నారెడ్కో-నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. 2022లో 500 బిలియన్ డాలర్లకు చేరుకున్న భారత రియల్ ఎస్టేట్ రంగం.. 2047 నాటికి 5.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ నివేదిక సారాంశం. ఇదిలా ఉంటే, 2024లో రియల్ ఎస్టేట్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు 51 శాతం పెరిగి దాదాపు 900 కోట్ల డాలర్లకు చేరాయని జేఎల్ఎల్ ఇండియా నివేదిక పేర్కొంది.