Un Secured Loans | భారత్లో రోజువారీ అవసరాల కోసం కుటుంబ అప్పులు పెరిగిపోతున్నాయని తేలింది. కుటుంబ అవసరాల కోసం ఇండ్ల రుణాలు వృద్ధి చెందడంతోపాటు 50 శాతానికి పైగా రిటైల్ రుణాలు ఉంటున్నాయని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణాలు జీడీపీలో 38 శాతానికి చేరాయి. అయితే, 2020-21 ఇంటి రుణాలు.. జీడీపీలో 39.2 శాతం కంటే 2022-23 రుణాలు తక్కువే. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రెజిల్ 35 శాతం, దక్షిణాఫ్రికాలో 34 శాతం ఇంటి రుణాలతో పోలిస్తే దేశీయంగా ఇంటి రుణాలు గణనీయంగా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది.
క్రెడిట్ కార్డు రుణాలతోపాటు అన్ సెక్యూర్డ్ లోన్లు గణనీయంగానే పెరుగుతున్నాయి. కానీ, ఇండ్ల రుణాల వృద్ధిరేటు ఆధారంగానే ఇంటి రుణాలు ఉంటున్నాయి. అన్ సెక్యూర్డ్ రుణాలు గణనీయ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై నిశిత పర్యవేక్షణ అవసరం అని ఈ నివేదిక పేర్కొంది. హౌస్ హోల్డ్ రుణాల్లో 50 శాతానికి పైగా రిటైల్ రుణాలే ఉన్నాయి. అయితే ఇంటింటి పొదుపు.. జీడీపీలో సుమారు 24 శాతం యధాతథంగా కొనసాగుతున్నదని కూడా ఈ నివేదిక పేర్కొంది. బ్యాంకుల్లో డిపాజిట్ల నుంచి రియల్ ఎస్టేట్ రంగానికి పొదుపు మళ్లించారని కూడా కేర్ ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. సొంతింటి కల సాకారం చేసుకోవడంతోపాటు ఇండ్ల డిమాండ్ కోసం పెట్టుబడులకు ప్రాధాన్యం పెరుగుతున్నది.