న్యూఢిల్లీ, జనవరి 7 : దేశ ఆర్థిక రంగానికి బీటలుపడుతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమో దు చేసుకుంటున్నదని భారతేనని నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న ప్రచారం అంతావుత్తదేనని తేలిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.4 శాతానికి పరిమితంకానున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కరోనా తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి వృద్ధిరేటు కానున్నదని అంచనా. తయారీ, సేవల రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడం వల్లనే వృద్ధి మందగిస్తున్నదని నివేదికలో వెల్లడించింది. కరోనా దెబ్బకు 2020-21లో దేశ వృద్ధిరేటు మైనస్ 5.8 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
దేశ వృద్ధిరేటు అంచనాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఎప్పుడూ ముందస్తు అంచనాలను విడుదల చేయలేదు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంక్ అంచనావేసిన 6.6 శాతం కంటే ఇది తక్కువగా ఉన్నది. అలాగే ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా 6.5 శాతం నుంచి 7 శాతంగా ఉంటుందని అంచనాను వెల్లడించాయి. వచ్చే నెల 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ కంటే ముందు విడుదలైన ఈ ముందస్తు జీడీపీ అంచనాలు ఉపయోగపడనున్నాయి. తయారీ రంగ వృద్ధి 9.9 శాతం నుంచి 5.3 శాతానికి పడిపోనున్నదని ఈ అంచనాల్లో పేర్కొంది. అలాగే ట్రేడ్, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ రంగాలు కలుపుకొని 5.8 శాతం వృద్ధిని సాధించనున్నాయని వెల్లడించింది. మరోవైపు, వ్యవయసాయ రంగం 3.8 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నదని అంచనా. దేశ జీడీపీ 2024-25లో రూ.324.11 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2023-24లో రూ.295.36 లక్షల కోట్లుగా ఉన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆశించిన స్థాయిలో నమోదు చేసుకోనున్న వృద్ధి.. వచ్చే ఏడాది మాత్రం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నాయి.