Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం – ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు మరో జీవిత కాల గరిష్టానికి పెరిగాయి. ఈ నెల రెండో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు 675 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ విదేశీ రంగ పెట్టుబడుల వృద్ధితో ఫారెక్స్ నిల్వలు పెరిగాయన్నారు. జూలై 26 తేదీతో ముగిసిన వారానికి 3.47 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వు నిల్వలు 667.39 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు గత నెల 19న ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 670.86 బిలియన్ డాలర్ల గరిష్టానికి చేరాయి.
ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 5.1 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 592.04 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం రిజర్వు నిల్వలు 2.4 బిలియన్ డాలర్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎస్డీఆర్లు (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) 41 మిలియన్ డాలర్లు పతనమై 18.161 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 8 మిలియన్ డాలర్లు పెరిగి 4.62 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు జూన్ నుంచి ఆగస్టు ఆరో తేదీ వరకూ 9.7 బిలియన్ డాలర్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో 4.2 బిలియన్ డాలర్ల నిధులను విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారని చెప్పారు.