Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు తాజాగా మరో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ ఆరో తేదీతో ముగిసిన వారానికి 5.2 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది, భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 689.24 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఆగస్టు 30తో ముగిసిన వారానికి 2.3 బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 683.99 బిలియన్ డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో ప్రధానమైన ‘ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 5.10 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 604.1 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. బంగారం రిజర్వు నిల్వలు 129 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 61.98 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) నాలుగు మిలియన్ డాలర్లు పుంజుకుని 18.47 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 9 మిలియన్ డాలర్లు పెరిగి 4.63 బిలియన్ డాలర్లకు చేరాయి.