Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పుంజుకున్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 10.47 బిలియన్ డాలర్లు పెరిగి 636.1 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పుంజుకుని 625.63 బిలియన్ డాలర్లకు చేరాయి.
2021 అక్టోబర్లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్టానికి చేరాయి. తర్వాత అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ తో రూపాయి మారకం విలువపై ఒత్తిళ్లతో ఫారెక్స్ నిల్వలు తగ్గుతూ వచ్చాయి. అంతర్జాతీయంగా భౌగోళిక ఒత్తిళ్లు, డాలర్-రూపాయి మారకం విలువలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు రూపాయి విలువ పతనం కాకుండా ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లు విక్రయిస్తుంది.