Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్య (Forex Reserve) నిల్వలు మరో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 23తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 681.69 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల 16తో ముగిసిన వారానికి 4.54 బిలియన్ డాలర్లు వృద్ధితో 674.66 బిలియన్ డాలర్లకు చేరిన ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు.. ఈ నెల 23తో ముగిసిన వారానికి మరో 7.02 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నది.
ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 5.98 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 597.55 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం రిజర్వు నిల్వలు 893 మిలియన్ డాలర్లు పెరిగి 60.9 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఎస్డీఆర్లు 118 మిలియన్ డాలర్లు పుంజుకుని 18.45 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు మూడు మిలియన్ డాలర్లు పెరిగి 4.68 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. ఆగస్టు రెండో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 675 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్టానికి చేరినా, ఆగస్టు తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి 4.8 బిలియన్ డాలర్లు పతనం అయ్యాయి.