Forex Reserves | గత నెల 28తో ముగిసిన వారానికి విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గిపోయాయి. 3.2 బిలియన్ డాలర్లు తగ్గి 603.87 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. జూలై 21తో ముగిసిన వారంలోనూ ఫారెక్స్ నిల్వలు 1.9 బిలియన్ డాలర్లు తగ్గి 607.03 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే.
విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign currency assets- FCAs) 2.4 బిలియన్ డాలర్లు తగ్గి 535.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అమెరికా డాలర్యేతర యూరో, పౌండ్, యెన్ తదితర విదేశీ మారక ద్రవ్య నిల్వల మారకం విలువల్లో మార్పు ఆధారంగా ఎఫ్సీఏలను నిర్ణయిస్తారు.
రెండేండ్ల క్రితం 2021 అక్టోబర్లో 645 బిలియన్ డాలర్లతో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైం గరిష్ట స్థాయి నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఆర్థికంగా, రాజకీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఫారెక్స్ నిల్వలు క్రమంగా తగ్గుమఖం పట్టాయి. రూపాయి మారకం విలువ పతనం కాకుండా సమయానుకూలంగా ఆర్బీఐ.. బహిరంగ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తూ.. ఫారెక్స్ నిల్వలను కాపాడేందుకు, రూపాయి విలువ పతనం కాకుండా అడ్డుకుంటూ ఉంటుంది.