Forex Reserves | రోజురోజుకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex) కుంచించుకుపోతున్నాయి. ఈ నెల నాలుగో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి 601.453 బిలియన్ డాలర్లకు పడిపోయాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు జూలై 28తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 3.2 బిలియన్ డాలర్లు పతనమై 603.87 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
విదేశీ కరెన్సీ నిల్వలు (ఎఫ్సీఏ’స్ -FCAs) 1.94 బిలియన్ డాలర్లు తగ్గి 533.4 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. అమెరికా డాలర్లతో డాలర్‌యేతర కరెన్సీలు యూరో, పౌండ్, యెన్ తదితర కరెన్సీల మారకం విలువ పతనం లేదా లబ్ధి ఆధారంగా మిగిలే నిధులను విదేశీ కరెన్సీ నిధుల నిల్వలు అంటారు.
బంగారం నిల్వలు సైతం 224 మిలియన్ డాలర్లు తగ్గి 44.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఎస్‌డీఆర్‌లు 171 మిలియన్ డాలర్లు తగ్గి 18.27 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్‌లో రిజర్వు నిల్వలు సైతం 86 మిలియన్ డాలర్లు తగ్గి 5.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
2021 అక్టోబర్‌లో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 645 బిలియన్ డాలర్లతో ఆల్ టైం రికార్డు స్థాయికి పెరిగాయి. నాటి నుంచి అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనంతో ఫారెక్స్ నిల్వలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పతనం కాకుండా అడ్డుకునేందుకు ఆర్బీఐ సమయానుకూలంగా జోక్యం చేసుకుని బహిరంగ మార్కెట్లో డాలర్లు విక్రయిస్తూ ఉంటుంది.