సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములపై సర్కారు మరో గందరగోళానికి తెరలేపింది. రాత్రికి రాత్రే వందలాది ప్లాట్లను యూఎల్సీ పేరిట నిషేధించిన సర్కారు… ఇప్పుడు మార్గదర్శకాల పేరిట మాయజాలం చేస్తున్నది. దశాబ్దాల కాలంగా ఉన్న ప్లాట్లు, ఇండ్లు కూడా యూఎల్సీ భూములుగా తేల్చిన సర్కారు… ఇప్పుడు నిబంధనల పేరిట జాబితాలో నుంచి తొలగించేందుకు అడ్డమైన కొర్రీలతో జనాలను అయోమయంలో పడేస్తుంది. ఇప్పటికే ఆస్తులపై యాజమాన్య హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్న సర్కారు… తాజా మార్గదర్శకాలు కేవలం 2016లో చేసుకున్న దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తాయని కుండబద్దలు కొట్టింది. మరీ ఆరు నెలల కిందట ఆ జాబితాలో చేరిన ఆస్తుల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.
2016లో దరఖాస్తు చేసుకున్న వాటికే మోక్షం
అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల పరిష్కారానికి మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కారు… వాటిని 2016లో దరఖాస్తు చేసుకున్న వాటికే పరిమితం చేసింది. దీంతోనే అసలు చిక్కులు వస్తున్నాయి. మరి కొత్తగా యూఎల్సీ భూములుగా నిర్ధారించిన వాటి పరిస్థితి ఏంటనే అంశం తేల్చకుండా.. 2016లో చేసుకున్న దరఖాస్తులకు అనుగుణంగా పరిష్కారం చూపాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక్కడే సర్కారు పేదల భూములతో చెలగాటానికి మరోసారి తెరలేపింది. వందల ఎకరాల్లో ఉన్న భూములు, ఇండ్లను కూడా యూఎల్సీ ముద్రను వేసిన సర్కారు… మార్గదర్శకాల్లో మాత్రం 2016లో దరఖాస్తు చేసుకున్న వాటినే పరిష్కరిస్తామని చెప్పడం జనాల్లో ఆందోళన కలిగిస్తున్నది.
ఎన్వోసీ పేరిట పేదలను వేధిస్తున్న సర్కారు
ఇందులో యూఎల్సీ భూములు కూడా ఉండగా… గడిచిన ఆరు నెలల కాలంగా నగర శివారుల్లో రియల్ ఎస్టేట్ను కాంగ్రెస్ సర్కారు ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది. ముందుగా రాత్రికి రాత్రే వేలాది స్థిరాస్తులను నిషేధిత జాబితాలో చేర్చి వేధింపులకు తెరలేపిన సర్కారు… ఇప్పుడు మనుగడలో లేని అర్బన్ ల్యాండ్ సీలింగ్ దస్ర్తాన్ని ప్రయోగించింది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదీగూడ వంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇండ్లు నిర్మించుకుని 30-40ఏండ్లు గడిచిపోతే… ఇప్పుడు అవసరానికి అమ్ముకునే వీల్లేకుండా ఆస్తులపై యూఎస్సీ రూపంలో ఓ పిడుగేసింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లిన భూ యజమానులకు గుండెల్లో గునపం దిగినంత పనవుతుందనీ వాపోతున్నారు. నిమిషాల్లో తమస్థిరాస్తుల మనుగడను ప్రశ్నార్థకం చేసిన సర్కారు… యూఎల్సీ దస్ర్తాల పేరిట ఎన్వోసీలు కోరుతోంది. ఇందులో ఫ్లాట్లను కూడా వదలకుండా ఇండ్లకు కూడా జాబితాలో చేర్చి ఎన్వోసీ ఉంటే తప్పా క్రయవిక్రయాలకు ఆస్కారం లేదని చెబుతుంది. అయితే కొత్తగా జాబితాలో చేరిన ఈ ఆస్తులకు ఎప్పుడూ మోక్షం కలిగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు తమ భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, క్రయవిక్రయాలు జరిగితే… ఇప్పుడే ఎందుకు నిషేధించారని, మార్గదర్శకాలు ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారని మండిపడుతున్నారు.