Forex Reserves | అంతర్జాతీయంగా ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని గణాంకాలు చెబుతున్నా.. ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు మాత్రం భారీగా పడిపోయాయి. రెండేండ్ల కనిష్ఠ స్థాయికి ఫారెక్స్ నిల్వలు పడిపోయాయని ఆర్బీఐ గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 2.234 బిలియన్ డాలర్లు పడిపోయి 550.871 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారెక్స్ నిల్వలు పడిపోవడం ఇది వరుసగా ఆరో వారం కావడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ ఫారెక్స్ నిల్వలు దాదాపు 80 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ అసెట్స్ 2.519 బిలియన్ డాలర్లు తగ్గి 489.598 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతకుముందు వారం విదేశీ కరెన్సీ నిల్వలు 6.527 బిలియన్ డాలర్లు పతనం అయ్యాయి.
అయితే ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారానికి బంగారం నిల్వల విలువ 340 మిలియన్ డాలర్ల నుంచి 38.644 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతకుముందు (సెప్టెంబర్ 2) ముగిసిన వారంలో 1.339 బిలియన్ డాలర్లు బంగారం నిల్వలు పడిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 63 మిలియన్ డాలర్లు పడిపోయి 17.719 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.