Forex Reserves | చాలా కాలం తర్వాత విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 5.4 బిలియన్ డాలర్లు తగ్గి 643.16 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు ఈ నెల ఐదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.9 బిలియన్ డాలర్లు పెరిగి 648.56 బిలియన్ డాలర్లతో జీవిత కాల గరిష్టానికి చేరాయి.
తాజాగా ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 6.51 బిలియన్ డాలర్లు తగ్గి 564.65 బిలియన్ డాలర్లకు పతనం అయ్యాయి. ఇదిలా ఉంటే, బంగారం నిల్వలు 1.24 బిలియన్ డాలర్లు పెరిగి 55.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎస్‌డీఆర్‌లు 93 మిలియన్ డాలర్ల పతనంతో 18.08 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి.
ఐఎంఎఫ్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 35 మిలియన్ డాలర్లు తగ్గి 4.63 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులను బట్టి డాలర్ విలువ పెరిగినప్పుడు రూపాయి మారకం విలువ పతనం అవుతుంది. అటువంటప్పుడు ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లు విక్రయించడం ద్వారా రూపాయి పతనాన్ని నివారిస్తుంది.