Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 17తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 1.88 బిలియన్ డాలర్ల పతనంతో 623.983 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల పదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 8.714 బిలియన్ డాలర్లు పతనమై 625.871 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. కొన్ని వారాలుగా నిరంతరం భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పతనం అవుతూనే ఉన్నాయి. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనంతో బహిరంగ మార్కెట్లో మరింత పతనం కాకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుని డాలర్లు విక్రయిస్తోంది.
ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఈ నెల 17తో ముగిసిన వారానికి 2.878 బిలియన్ డాలర్లు పతనమై 533.133 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గోల్డ్ రిజర్వ్స్ 1.063 మిలియన్ డాలర్లు పుంజుకుని 68.947 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) ఒక మిలియన్ డాలర్లు పెరిగి 17.782 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ నిల్వలు 74 మిలియన్ డాలర్లు పెరిగి 4.122 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి.