Forex Reserves | విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు 642.50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.396 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 642.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు వారం 10.47 బిలియన్ డాలర్ల వృద్ధితో 636.095 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్లతో ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకాయి. 2021 అక్టోబర్ తర్వాత డాలర్‌పై రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తల ప్రభావంతో తగ్గిన ఫారెక్స్ నిల్వలు.. తాజాగా క్రమంగా పుంజుకుంటున్నాయి.
మార్చి 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వల్లో ప్రధానమైన ఫారిన్ కరెన్సీ నిల్వలు 6.034 బిలియన్ డాలర్లు పెరిగి, 568.386 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్‌లో యూరో, పౌండ్, యెన్ల విలువ వృద్ధి, క్షీణతల ప్రభావం ఫారిన్ అసెట్స్ నిల్వలపై పడుతుంది. బంగారం నిల్వలు 425 మిలియన్ డాలర్లు పెరిగి 51.14 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) సైతం 65 మిలియన్ డాలర్ల వృద్ధితో 18.276 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 129 మిలియన్ డాలర్లు పెరిగి 4.689 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.