Forex Reserves | విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు నిండుకుంటున్నాయి. ఈ నెల 17తో ముగిసిన వారానికి ఆర్బీఐ వద్ద ఫారెక్స్ నిల్వలు 5.7 బిలియన్ డాలర్లు తగ్గి, 561.27 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది 11 వారాల కనిష్టం అని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ వద్ద విదేశీ కరెన్సీ ఆస్తుల ఖాతా తగ్గడం ఇది వరుసగా మూడోవారం. అంతకుముందు ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిన వారానికి 4.5 బిలియన్ డాలర్లు తగ్గి496.07 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ నెల 17తో ముగిసిన వారానికి బంగారం నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయి. 100 కోట్ల డాలర్ల విలువైన బంగారం నిల్వలు తగ్గి 41.82 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ ఈ వారంలో 0.4 శాతం తగ్గి 82.83 వద్ద స్థిర పడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ల నిల్వలు తగ్గిపోవడానికి కారణం.. రూపాయి విలువ మరింత పతనం కాకుండా డాలర్లు విక్రయించడమే కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు.
`డాలర్‌కు డిమాండ్ ఏర్పడటంతో కేంద్రీయ బ్యాంకు జోక్యం చేసుకుని విక్రయించడం వల్ల నాన్-డాలర్ ఆస్తులు తగ్గుముఖం పట్టాయి. రుణాల పేమెంట్స్ కోసం కార్పొరేట్లు డాలర్లు చెల్లించడం కూడా మరో కారణం` అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో శరవేగంగా పెరిగిన ఫారెక్స్ నిల్వలు ఇటీవలి కాలంలో పడిపోతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాల వల్ల కూడా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగింది.
గత నెల 27 నాటికి ఆర్బీఐ వద్ద ఫారెక్స్ నిల్వలు 576.8 బిలియన్ డాలర్లు. గతేడాది జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడంతోపాటు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఫారెక్స్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో రూపాయి విలువ మరింత పతనం కాకుండా ఆర్బీఐ భారీగా డాలర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించింది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఫారెక్స్ రిజర్వు నిల్వలు 561.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి.