
న్యూఢిల్లీ: దేశంలోనే సెంట్రలైజ్డ్ ఏసీ గల రైల్వే టర్మినల్ త్వరలో ప్రజలకు వినియోగంలోకి రానున్నది. ప్రముఖ సివిల్ ఇంజినీర్, భారత్ రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరిట కర్ణాటక రాజధాని బెంగళూరులోని బయప్పనహల్లిలో ఇది కొలువు దీరింది. దేశంలోనే మొట్టమొదటి ఏసీ టర్మినల్‌గా దీని నిర్మాణానికి రూ.314 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తున్నది. ఈ నెలాఖరులో ఈ ఏసీ రైల్వే టర్మినల్ ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది.

భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుతో బెంగళూరులో నిర్మించిన తొలి ఏసీ రైల్వే టర్మినల్ త్వరలో ప్రజలకు వినియోగంలోకి రానున్నదని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం ట్వీట్ చేశారు. బెంగళూరుతో అనుసంధానానికి మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో బయప్పనహల్లిలో న్యూ కోచ్ టర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో బయప్పనహల్లిలో మూడో కోచ్ టర్మినల్ సాంక్షన్ అయ్యింది. దేశ స్వాతంత్ర్యానంతరం జాతి నిర్మాణంలో అహర్నిశలు సేవలందించిన భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు పెట్టామని నైరుతి రైల్వే జోన్ చీఫ్ పీఆర్వో తెలిపారు. విమానాశ్రయాన్నే తలదన్నేలా నిర్మించిన ఈ టర్మినల్‌ను ప్రారంభించిన తర్వాత ముంబై, చెన్నై వంటి సుదూర మెట్రోపాలిటన్ నగరాలతోపాటు కర్ణాటకలోని వివిధ జిల్లాలను బెంగళూరుతో అనుసంధానించేందుకు మరిన్ని రైళ్లు నడుపుతామన్నారు.

ఇప్పటికే బెంగళూరు నగరంలోని కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఈ టర్మినల్ ఉపకరిస్తుందని రైల్వేశాఖ అధికారులు భావిస్తున్నారు. 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్ ప్రారంభమైతే రోజుకు 50 రైళ్లు ఆపరేట్ చేయొచ్చు. రోజువారీ 50 వేల మంది స్టేషన్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.

ఏడు ప్లాట్‌ఫామ్‌లు గల ఈ టర్మినల్ వద్ద సుమారు 200కి పైగా కార్లు.. వెయ్యి వరకు బైక్‌లు, స్కూటర్లు పార్కింగ్ చేసేందుకు వసతులు కల్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు సబ్‌వేలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టు, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాలు, రియల్ టైం ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తదితర వసతులు కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1
— Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021