ముంబై, సెప్టెంబర్ 28: భారత్‌కున్న విదేశీ రుణభారం (కార్పొరేట్ సహా) పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి అప్పుల విలువ 629 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం తెలియజేసింది. మార్చి ఆఖర్లో 624.3 బిలియన్ డాలర్లుగా ఉంటే, జూన్ చివర్లో 4.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.40వేల కోట్లు) ఎగిసి 629.1 బిలియన్ డాలర్లకు చేరినట్టు వెల్లడించింది. కాగా, మొత్తం భారతీయ విదేశీ అప్పుల్లో మెజారిటీ వాటా అమెరికా డాలర్ ఆధారిత రుణాలదే.
54.4 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ ఈ సందర్భంగా వివరించింది. ఆ తర్వాత ఇండియన్ రుపీ (30.4 శాతం), ఎస్డీఆర్ (5.9 శాతం), యెన్ (5.7 శాతం), యూరో (3 శాతం) ఉన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా దేశీయ విదేశీ రుణభారాన్ని పెంచుతున్నట్టు ఆర్బీఐ చెప్తున్నది. ఇదిలావుంటే దేశ కరెంట్ ఖాతా లోటు ఈ ఏప్రిల్-జూన్ వ్యవధిలో 9.2 బిలియన్ డాలర్లుగా లేదా దేశ జీడీపీలో 1.1 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ తెలియజేసింది. మరోవైపు భారత్‌లో విదేశాలకు చెందిన ఆస్తులు పెరిగిపోతున్నాయని ఆర్బీఐ చెప్పింది. ఈ ఏప్రిల్-జూన్‌లో నాన్ ఇండియన్ రెసిడెంట్స్ నెట్ క్లెయిమ్స్ 379.7 బిలియన్ డాలర్లకు చేరినట్టు వివరించింది. గతంతో చూస్తే 12.1 బిలియన్ డాలర్లు పెరిగాయన్నది.