Exports : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్‌లు భారత ఎగుమతుల (Exports to US) పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల ధరలు అక్కడ భారీగా పెరిగిపోయాయి. దాంతో అమెరికా మార్కెట్లో పోటీని తట్టుకోలేని స్థితి నెలకొంది. ఈ విషయాన్ని ‘గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI)’ సంస్థ వెల్లడించింది.
గత (ఆగస్టు) నెలలో అమెరికాకు ఎగుమతులు 16.3 శాతం తగ్గి 6.7 బిలియన్ డాలర్లకు చేరాయి. టారిఫ్‌లు 50 శాతానికి పెరగడంతో ఒక్కసారిగా ఎగుమతుల్లో తగ్గుదల కనిపించింది. గత మూడు నెలల నుంచి ఎగుమతుల్లో వరుసగా తగ్గుదల కనిపిస్తోంది. జూలైలో ఈ తరుగుదల 3.6 శాతంగా నమోదైంది. జూన్‌లో 5.7 శాతానికి తగ్గింది. అమెరికాకు భారత ఎగుమతులు చివరిసారిగా మే నెలలో పెరిగాయి. అప్పుడు 4.8 శాతం వృద్ధి చెంది 8.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
అంతకుముందు నెల అంటే ఏప్రిల్‌లో 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. టారిఫ్‌లలో భారీగా పెరుగుదల ఎగుమతుల్లో తరుగుదలకు కారణమైందని జీటీఆర్ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. గత మూడు నెలల ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే సెప్టెంబర్ నెలలో ఎగుమతుల పతనం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. పూర్తిస్థాయిలో టారిఫ్‌ల దెబ్బ తీవ్రత ఈ నెలలోనే తెలుస్తుందని అన్నారు. ఏప్రిల్ 4 వరకు అమెరికా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాలో భారత సరుకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగుమతి అయ్యాయి.
ఆ తర్వాత ట్రంప్ అన్ని దేశాలకు 10 శాతం పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా వ్యాపార సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో మే నెలలో కూడా ఎగుమతులు పెరిగాయి. కానీ ఆ తర్వాత నుంచి పలు దేశాలను లక్ష్యంగా చేసుకొని టారిఫ్‌లు విధించడం ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన సుంకాలు భారత ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నెలలో తొలుత 25 శాతం ఆ తర్వాత మరో 25 శాతం పన్నులు భారత్‌పై పడ్డాయి. అయితే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫోన్లు, ఔషధాలకు మాత్రం మినహాయింపు లభిస్తోంది.
అయినా ఈ స్థాయి తరుగుదల నమోదైందంటే మిగిలిన ఉత్పత్తులు అనుకున్న దానికంటే తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్టే లెక్క. లేబర్ ఆధారిత పరిశ్రమలైన దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, లెదర్, రొయ్యలు, కార్పెట్ల లాంటివి ఒత్తిడికి గురికానున్నాయి. వీటిల్లో 30-60 శాతం మధ్య ఎగుమతులు అమెరికాకే వెళ్తాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ టారిఫ్‌లు కొనసాగితే 30-35 బిలియన్ డాలర్ల మేరకు అమెరికాతో వ్యాపారాన్ని భారత్ నష్టపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.