న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశీయ ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. గత నెలలో ఏకంగా 9.3 శాతం క్షీణించాయి. గడిచిన 13 నెలల్లో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఆగస్టులో ఆయా దేశాలకు భారత్ నుంచి జరిగిన ఎగుమతుల విలువ 34.71 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. మరోవైపు వివిధ దేశాల నుంచి భారత్కు వచ్చిన దిగుమతుల విలువ 3.3 శాతం పెరిగి 64.36 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఇది రికార్డుస్థాయి కావడం గమనార్హం. దీంతోనే వాణిజ్య లోటు సైతం 10 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 29.65 బిలియన్ డాలర్లను తాకింది. ఈ మేరకు మంగళవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆగస్టులో దేశంలోకి పసిడి, వెండి దిగుమతులు పెద్ద ఎత్తున జరిగాయి. వీటిలో బంగారం విలువ 10.06 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 4.93 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. అలాగే వెండి దిగుమతులు 727 మిలియన్ డాలర్లకు ఎగిశాయి. నిరుడు 159 మిలియన్ డాలర్లే. దీంతో దేశీయ దిగుమతులు మొత్తంగా పెరగడానికీ ఇవి దోహదం చేశాయి. నిజానికి దేశీయ దిగుమతుల్లో క్రూడాయిల్ వాటానే ఎక్కువ. దేశ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. కానీ పెట్రోలియం ధరలు తక్కువగా ఉండటంతో ముడి చమురు దిగుమతులు ఈ ఆగస్టులో 11 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.
క్రిందటి ఏడాది ఆగస్టుతో చూస్తే ఇది 32.38 తక్కువ. కానీ ఇదే స్థాయిలో బంగారం, వెండి దిగుమతులుండటం.. ఈసారి వాణిజ్య లోటును ఎగదోసింది. అయితే కస్టమ్స్ సుంకాల కోత, పండుగ సీజన్ డిమాండ్ వల్లే ఈ స్థాయిలో గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్స్ జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అంటున్నది. కస్టమ్స్ సుంకాల తగ్గింపు.. స్మగ్లింగ్, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను తగ్గుముఖం పట్టేలా చేసిందని వాణిజ్య కార్యదర్శి సునీల్ భరత్వాల్ చెప్తున్నారు. ఈ ఏడాది జూలైలో ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి దించిన సంగతి విదితమే.
సరిహద్దుల్లో కుస్తీ.. వాణిజ్యంలో దోస్తీ అన్నట్టుగా చైనాతో కేంద్ర ప్రభుత్వం వైఖరి సాగుతున్నది. గత నెల చైనాకు భారత్ నుంచి ఎగుమతులు 22.44 శాతం పతనమై 1 బిలియన్ డాలర్లకు పరిమితమైతే.. చైనా నుంచి భారత్కు దిగుమతులు 15.55 శాతం పెరిగి 10.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య చైనాకు భారతీయ ఎగుమతులు గతంతో చూస్తే 8.3 శాతం దిగజారి 5.8 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. కానీ చైనా నుంచి భారత్కు దిగుమతులు 10.96 శాతం ఎగబాకి 46.65 బిలియన్ డాలర్లను తాకాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 35.85 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
2013-14 నుంచి 2017-18 వరకు అలాగే 2020-21లో భారత్కు చైనానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక అమెరికా, యూఏఈ, సింగపూర్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, నేపాల్, బెల్జియం, టర్కీ దేశాలకూ భారత్ నుంచి ఎగుమతులు గత నెల పడిపోయాయి. ఇదే సమయంలో యూఏఈ, స్విట్జర్లాండ్, కొరియా, జపాన్, థాయిలాండ్, వియత్నాం, తైవాన్ దేశాల నుంచి భారత్కు దిగుమతులు పెరిగాయి. మొత్తానికి అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, ఎర్ర సముద్రం సంక్షోభం.. భారతీ ఎగుమతుల్ని దెబ్బతీశాయని కేంద్రం తాజా పరిస్థితులను వెనకేసుకొస్తున్నప్పటికీ, ఇతర దేశాల నుంచి భారత్కు దిగుమతులు పెరగడం.. దేశీయ తయారీ రంగాన్ని వెక్కిరిస్తోందని పలువురు ఆర్థిక నిపుణులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.