India : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత దేశం 7.7 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది వృద్ధి రేటు 7.1 శాతంకాగా, ఈ ఏడాది అంతకుమించి వృద్ధి రేటు సాధించింది.
ఒకపక్క అంతర్జాతీయ సంక్షోభం, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ దేశం భారీగా జీడీపీ వృద్ధిరేటు సాధించిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులోనూ గత జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చేదే. ఈ ఏడాది అరుదైన ఫలితాలు సాధించడంలో తయారీ, సేవలు, వాణిజ్య రంగాలతోపాటు, వ్యవసాయం, మత్స్య రంగాలు కూడా కీలకంగా మారాయి. 2022–23 నాటి స్థిర ధరల అంచనా ప్రకారం ఈ ఏడాది జీడీపీ 323.12 లక్షల కోట్లకు చేరుకుంది.
అంతకుముందు సంవత్సరం.. అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 299.89 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే సాధారణ జీడీపీ రేటు 8.9 శాతానికి పెరిగింది. అంటే దీని విలువ గత ఏడాది 318.07 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది 346.36 లక్షల కోట్లకు చేరింది. జీడీపీ అంటే దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువులు, సేవల మొత్తం విలువ.