Moody’s on Indian Economy | భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ సంస్థ మూడీస్ పేర్కొంది. కోవిడ్-19 ఆంక్షలను సడలిస్తున్నా కొద్దీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని వ్యాఖ్యానించింది. 2021లో భారత్ వృద్ధి రేటు 9.6 శాతాన్ని కొనసాగిస్తుందని, 2022లో ఏడు శాతం వద్ద నిలుస్తుందని మంగళవారం అంచనా వేసింది. గ్లోబల్ మాక్రో ఔట్లుక్ 2021-22
అనే పేరుతో తాజా ఆర్థిక పరిస్థితులపై నివేదిక విడుదల చేసింది.
కరోనా రెండో వేవ్‌ను కట్టడి చేయడానికి విధించిన ఆంక్షలు క్రమంగా సడలిస్తున్నా కొద్దీ భారత్‌లో ఆర్థిక కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని వెల్లడించింది. దేశీయ ఆర్థిక వృద్ధి మెరుగు పడే వరకూ ఆర్బీఐ సానుకూల ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు ఇదే విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది చివరి వరకు, వచ్చే ఏడాది ప్రారంభం వరకు వృద్ధి వేగం పుంజుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్య పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు తటస్థ ద్రవ్య పరపతి విధానం అమలు వైపు మళ్లుతాయని భావిస్తున్నట్లు మూడీస్ వివరించింది.
గతేడాది భారత్ ఆర్థిక వృద్ధిరేటు 7.3 శాతానికి పరిమితమైంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందని ప్రారంభంలో రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి. కానీ కరోనా రెండో వేవ్ ప్రభావంతో అంచనాలను తర్వాత తగ్గించివేశాయి. గత జూన్‌లో భారత్ వృద్ధిరేటు 9.3 శాతంగా ఉంటుందని మూడీస్ పేర్కొంది.