దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ముంగిట్లో ఉన్నదా?.. భారత్ మాంద్యంలోకి జారుకుంటున్నదా?.. గత రెండు రోజులుగా వెలుగులోకి వస్తున్న పరిణామాలు నిజమేనని చెప్తున్నాయి. ఓవైపు దేశ జీడీపీలో 84 శాతానికి రుణ భారం చేరిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయంగా ఇండియా రుణ పరపతి ప్రమాదంలో పడిందని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ దిగ్గజ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ హెచ్చరించింది. సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 9వ నెల ఆర్బీఐ లక్ష్యాన్ని దాటి 7.4 శాతంగా నమోదైంది. ఆగస్టులో దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ 18 నెలల కనిష్ఠాన్ని తాకుతూ మైనస్ 0.8 శాతానికే పరిమితమైంది. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ.. మాంద్యం దిశగా నడుస్తున్నదన్న సంకేతాలనే ఇస్తున్నాయి మరి. అంతేకాదు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు విధానాల్లో వైఫల్యాలనూ ఎత్తి చూపుతున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: పలు వర్థమాన దేశాలకంటే భారత్కు రుణభారం అధికమని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది. 2022 ఏడాది ముగింపుకల్లా భారత్ రుణ నిష్పత్తి జీడీపీలో 84 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఐఎంఎఫ్ ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పోలో మౌరో చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక స్థితిపై ఒక మధ్యకాలిక లక్ష్యంతో భారత్ వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ‘పరిస్థితి అదుపులోనే ఉన్నదని, క్రమేపీ చక్కబడుతుందని ప్రజలకు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అభయం ఇవ్వడం చాలా ముఖ్యం’ అని మౌరో చెప్పారు. అయితే భారత్ చాలా పెద్ద దేశంకావడం, అధిక జనాభా కలిగినది కావడం, రుణం చాలావరకూ దేశీ కరెన్సీలో ఉండటం, రుణ పత్రాల్ని ఎక్కువగా కొనుగోలు చేసేది దేశీ ఇన్వెస్టర్లే కావడం వంటి మంచి ఫీచర్ల కారణంగా ఈ భారీ రుణాన్ని తట్టుకునే సామర్థ్యం భారత్కు ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ప్రతీ ఏటా రుణాల రోలోవర్ (పాతవి చెల్లించి, కొత్తవి తీసుకోవడం) అధికమని, ఇది జీడీపీలో దాదాపు 15 శాతంగా ఉందని తెలిపారు. అందుచేత ద్రవ్యలోటు మీద దృష్టి నిలపాలన్నారు.

ద్రవ్యలోటు 10 శాతం
భారత్ ద్రవ్యలోటు ప్రస్తుతం జీడీపీలో 10 శాతం ఉందని ఐఎంఎఫ్ అధికారి చెప్పారు. పలు వర్థమాన ఆర్థిక వ్యవస్థలకంటే ఇది ఎక్కువని, ఇందులో 6.5 శాతం కేంద్ర ప్రభుత్వానిదికాగా, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వాలదని వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యోల్బణం కూడా భారత్లో ఎక్కువగానే ఉందన్నారు. ఈ అంశాలన్నింటినీ చూస్తే..ద్రవ్యలోటును కుదించుకోవాల్సి ఉందని, కాలంగడిచేకొద్దీ రుణాన్ని సైతం క్రమేపీ తగ్గించుకోవాలని పోలో మౌరో సూచించారు. కానీ ద్రవ్యలోటును, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయకుండా, దేశం అధిక వృద్ధి సాధించలేదని, రుణ నిష్పత్తిని తగ్గించుకోలేదని స్పష్టంచేశారు.
ద్రవ్యోల్బణం దుష్ప్రభావాలివీ..
వ్యాపారం లేదు.. పెట్టుబడులు రావు.. ఉత్పత్తి జరగదు.. ఇదీ ఇప్పుడు స్థూలంగా దేశ పారిశ్రామిక రంగంలో నెలకొన్న దుస్థితి. బుధవారం విడుదలైన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఆగస్టులో 18 నెలల కనిష్ఠాన్ని తాకుతూ ఐఐపీ మైనస్ 0.8 శాతానికి పరిమితమైంది. నిరుడు ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయికి దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ గణాంకాలు పడిపోవడం ఇదే తొలిసారి. నాడు మైనస్ 3.2 శాతంగా ఉన్నది. కాగా, ఈ ఏడాది జూలైలో ఐఐపీ వృద్ధి 2.2 శాతంగా ఉండగా, గత ఏడాది ఆగస్టులో 13 శాతంగా ఉన్నట్టు తాజా గణాంకాలు చెప్తున్నాయి.
