ఓవైపు వచ్చే 4 ఏండ్లలో టాప్-3 ఎకానమీల్లో ఒకటిగా నిలుస్తామని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది.
మరోవైపు భారత్ ప్రస్తుతం పాటిస్తున్న ఆర్థిక గణాంకాల లెక్కింపు పద్ధతులు మారాల్సిన అవసరం ఉన్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మొట్టికాయలు వేస్తున్నది.
అవును.. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబించే కీలకమైన జీడీపీ, ద్రవ్యోల్బణం గణాంకాల కోసం అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఐఎంఎఫ్ చెప్పేసిందిప్పుడు.
న్యూఢిల్లీ, నవంబర్ 27 : జీడీపీతోపాటు జీవీఏ, ద్రవ్యోల్బణం వంటి కీలక గణాంకాలతో కూడిన భారత నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తమ వార్షిక సమీక్షలో ‘సీ’ గ్రేడ్ ఇచ్చింది. ఐఎంఎఫ్ గ్రేడ్లలో ఇది రెండో తక్కువ స్థాయి శ్రేణి కావడం గమనార్హం. సాధారణంగా ఏ, బీ, సీ, డీ గ్రేడ్లను ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్ లేదా క్యూ2)గాను శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసే జీడీపీ గణాంకాలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఐఎంఎఫ్ ఇచ్చిన ‘సీ’ గ్రేడ్.. భారత ఆర్థిక వృద్ధిరేటు, ధరల సూచీ ఇతరత్రా కీలక గణాంకాల కొలమానాలు సరిగా లేవన్నది తేటతెల్లం చేస్తున్నది. ‘కీలక గణాంకాల ప్రకటన కోసం భారత్ అవలంభిస్తున్న పద్ధతులు బలహీనంగా ఉన్నాయి. పర్యవేక్షణ లోపించిందని కనిపిస్తున్నది’ అని భారత ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ మదింపునకు సంబంధించిన ఆర్టికల్-4 వార్షిక అసెస్మెంట్లో ఐఎంఎఫ్ పెదవి విరిచింది. ఈ క్రమంలోనే అన్ని డాటా కేటగిరీలకు ‘బీ’ గ్రేడ్‌తో సరిపెట్టింది.

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం లెక్కింపునకు కాలం చెల్లిన 2011-12 బేస్ ఇయర్‌ను పాటిస్తున్నారని ఐఎంఎఫ్ మొట్టికాయలు వేసింది. అయితే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని కొలిచే విధానం కొంత బాగానే ఉందన్నది. అయినప్పటికీ ఇంకా మెరుగైతే బాగుంటుందన్నది. ప్రస్తుత వ్యయాలను కచ్చితత్వంతో పరిగణనలోకి తీసుకోవట్లేదని గుర్తుచేసింది. కానీ జీడీపీ కొలమానంలో ఉత్పత్తి, వ్యయాల విషయంలోనూ చెప్పుకోదగ్గ వ్యత్యాసాలే కనిపిస్తున్నాయన్నది. డాటాలో ఖర్చులకు సంబంధించిన కవరేజీని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా అసంఘటిత రంగానికి ప్రాధాన్యత పెరగాలని సూచించడం విశేషం.
మొదట్నుంచీ ప్రభుత్వం, ప్రజలు, కంపెనీల ఆదాయాలతోనే జీడీపీని లెక్కించడం భారత సర్కారుకు అలవాటైపోయిందన్నది. అందుకే వ్యయాలకూ పెద్దపీట వేయాలని సూచించింది. ఈ క్రమంలోనే త్రైమాసిక ఆర్థిక గణాంకాల్లో ఇతర గణాంక మెలకువల్నీ అనుసరించాలని కోరింది. అప్పుడే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో మార్పులను, లోతైన అంశాలను అవగతం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నామని ఏ గణాంకాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రోజూ చెప్తూపోతున్నదో ఆ లెక్కలన్నీ కాకి లెక్కలేనా? అన్న సందేహాలు ఐఎంఎఫ్ తాజా గ్రేడింగ్‌తో రేకెత్తుతున్నాయి.