న్యూఢిల్లీ, మే 7: హైదరాబాద్ ఆధారిత స్పేస్ టెక్నాలజీ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ యునికార్న్‌గా అవతరించింది. దేశంలోనే తమది తొలి స్పేస్-టెక్ యునికార్న్ అని గురువారం ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇటీవల సమీకరించిన దాదాపు 60 మిలియన్ డాలర్లతో తమ సంస్థ విలువ 1.1 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొన్నాయి.
కంపెనీ వాల్యూ బిలియన్ డాలర్లు దాటితే దానిని యూనికార్న్‌గా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. కాగా, షెర్పలో వెంచర్స్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ, గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు, అర్కమ్ వెంచర్స్ మరికొన్ని సంస్థల నుంచి ఫండింగ్ పొందినట్టు ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వివరించింది. కాగా, అంతరిక్షంలోకి వెళ్లడం ఇప్పుడు మన ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటని, స్కైరూట్ ఆ సవాళ్లను అధిగమించేందుకు చక్కని మార్గాలను నిర్మిస్తున్నదని, భవిష్యత్తులో ఈ పరిశ్రమలో అద్భుత విజయాలు ఖాయమన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా షెర్పలో వెంచర్స్ వ్యవస్థాపకుడు రామ్ శ్రీరామ్ ఓ ప్రకటనలో వ్యక్తం చేశారు.
ఇక విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే స్కైరూట్ తాజా ఫండింగ్‌కు దిగింది. విక్రమ్-1.. భారత్‌లో ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి రాకెట్ కావడం విశేషం. గ్లోబల్ శాటిలైట్ కార్యకలాపాల కోసం అంతరిక్షంలోకి పంపడానికి దీన్ని రూపొందించారు. ఇదిలావుంటే విక్రమ్-1 ప్రయోగానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా స్కైరూట్ సీఈవో, ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్ కుమార్ చందన ఓ ప్రకటనలో అన్నారు. అలాగే ఈ ప్రయోగాన్ని ఇటు భారత్‌కు, అటు ప్రపంచ అంతరిక్ష రంగానికి కీలక మైలురాయిగా అభివర్ణించారు. అంతేగాక మున్ముందు తమ కంపెనీలోకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మదుపర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాగలవన్న విశ్వాసాన్ని సైతం కనబర్చారు.