Air Passengers | న్యూఢిల్లీ, మే 16: దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 40-42 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. కరోనా కంటే ముందుస్థాయికి విమాన ప్రయాణికులు చేరుకున్నారని, గతేడాది మార్చి నాటికి వీరి సంఖ్య 37.64 కోట్లకు చేరుకున్నట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
గడిచిన నాలుగేండ్లుగా ప్రతియేటా 8-11 శాతం సరాసరి వృద్ధితో వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్య 40.7 కోట్ల నుంచి 41.8 కోట్ల మధ్యలో నమోదుకానున్నట్లు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు ఎయిర్పోర్ట్స్ ఆథార్టీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఇక్రా. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల్లో భారత్ వాటా 4.2 శాతానికి పెరిగింది.