ముంబై, ఏప్రిల్ 28 : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా 3 రోజులపాటు క్షీణించిన సూచీలు.. సోమవారం కోలుకున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం తిరిగి పతనమయ్యాయి. భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగడం, భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం.. కొనుగోలు సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన దగ్గర్నుంచి మదుపర్లు అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 416.72 పాయింట్లు లేదా 0.54 శాతం దిగజారి 76,886.91 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 562.57 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ 97 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టపోయి 23,995.70 దగ్గర నిలిచింది. హెవీ వెయిట్ షేర్ మారుతీ సుజుకీ బీఎస్ఈలో 2.53 శాతం క్షీణతతో రూ.12,891. 70 వద్ద స్థిరపడింది. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం 6.45 శాతం పడిపోవడమే కారణం.
విమానయాన, బ్యాంకింగ్ రంగాల షేర్లకు మదుపర్లు దూరం జరిగారు. పెరుగుతున్న ఇంధన ధరల మధ్య కార్యకలాపాలు నడుపలేని దుస్థితిలో ఉన్నామని దేశీయ ప్రధాన ఎయిర్‌లైన్స్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం.. షేర్ల కొనుగోలు అవకాశాలను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే స్పైస్‌జెట్ షేర్ విలువ బీఎస్ఈలో 4.96 శాతం దిగజారి రూ.14 వద్ద ముగిసింది. ఇండిగో షేర్ విలువ కూడా 2.59 శాతం పడిపోయి రూ.4,445.10 వద్ద ఆగింది. మరోవైపు నిబంధనల కఠినతరం అంచనాల నడుమ బ్యాంకింగ్ షేర్లూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం భారీగా క్షీణించింది. ఈ ఒక్కరోజే 53 పైసలు దిగజారింది. ఫలితంగా 94.68 వద్ద స్థిరపడింది. కాగా, పెరుగుతున్న ముడి చమురు ధరలు, వెనుకకుపోతున్న విదేశీ పెట్టుబడులు.. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ను పెంచాయని తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు.