ముంబై, సెప్టెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, చమురు, గ్యాస్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో చివరి అరగంటలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడం, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అవకాశాలుండటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. వీటికి తోడు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి.
ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ 76 వేల పాయింట్ల కిందకు పడిపోయాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి గతవారం ముగింపుతో పోలిస్తే 382.62 పాయంట్లు నష్టపోయి 76,132.81 వద్ద స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో 23 షేర్లు నష్టపోగా, కేవలం ఏడు మాత్రమే లాభపడ్డాయి. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 118.55 పాయింట్లు కోల్పోయి 23,779.15 వద్ద ముగిసింది. బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్లనే సూచీలు పతనం బాటపట్టాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉన్నట్టు వచ్చిన వార్తలు ఐటీ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 4 శాతం వరకు పతనం చెందాయి.