ముంబై, సెప్టెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియా సెగ గట్టిగానే తాకింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో వరుసగా మూడోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు చమురు ధరలు భగ్గుమననుండటం మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయి.
ఫలితంగా ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 373.93 పాయింట్లు కోల్పోయి 76,570.35 వద్ద ముగిసింది. వాహన, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. మరోసూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 141.35 పాయింట్లు నష్టపోయి 24 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 23,914.45 వద్ద స్థిరపడింది.