న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పేటీఎంకు మద్దతుగా పదికిపైగా స్టార్టప్‌లు కదిలాయి. పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఇటీవలి ఆంక్షలు సరికాదని, పునరాలోచించాలని కోరుతూ అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు దాదాపు డజను స్టార్టప్‌ల వ్యవస్థాపకులు లేఖ రాశారు. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ తీసుకున్న చర్యలు, పెట్టిన ఆంక్షలు యావత్తు ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ను కలవరపర్చేలా ఉన్నాయి. దీనిపై ఫిన్‌టెక్ కంపెనీలతో నిర్మాణాత్మక చర్చలు జరుపాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సదరు లేఖలో స్టార్టప్ ఫౌండర్లు పేర్కొన్నారు. దీనిపై అంతా సంతకాలు కూడా చేశారు. వీరిలో రాజేశ్ మ్యాగో (మేక్మైట్రిప్), మురుగవేల్ జానకిరామన్ (భారత్ మ్యాట్రిమొని), దీపక్ షెనాయ్ (క్యాపిటల్‌మైండ్) తదితరులున్నారు.
పేటీఎంపై ఆర్బీఐ తీరు.. భారత్‌కున్న వ్యాపార అనుకూల ముద్రను దెబ్బతీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పనిగట్టుకుని ఆర్బీఐతో గొడవలకు దిగడం సరికాదన్న భావన కూడా స్టార్టప్‌ల్లో కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ లేఖపట్ల ఫిన్‌టెక్ స్టార్టప్‌ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తున్నది. నిబంధనల్ని ఉల్లంఘించిందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. ఈ నెల 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, డిజిటల్ వ్యాలెట్లలో ఏ రకమైన డిపాజిట్లను అంగీకరించవద్దని ఆంక్షలు పెట్టిన సంగతీ విదితమే. వచ్చే నెల ఆరంభంలో బ్యాంక్ లైసెన్స్‌నూ రద్దు చేస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంతేగాక పేటీఎం షేర్లపైనా ఈ ప్రభావం కనిపిస్తున్నది. 2 కోట్ల వ్యాపారులు, 30 కోట్ల కస్టమర్లూ అయోమయంలో పడ్డారు. 2009లో పేటీఎంను విజయ్ శేఖర్ శర్మ స్థాపించారు. 2015లో పేటీఎంకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ వచ్చింది. 2017 నవంబర్‌లో కార్యకలాపాలు మొదలయ్యాయి.
పేటీఎం వ్యాలెట్‌ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సంస్థ కొనబోతున్నదన్నది ఊహాగానమేనని పేటీఎం కొట్టిపారేసింది. ఈ ప్రచారం నిరాధారమైనదని, సత్యదూరమని అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఏ రకమైన లావాదేవీలు జరుగలేదని స్పష్టం చేసింది. పేటీఎం వ్యాలెట్‌ను కొనేందుకు దాని మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చర్చలు జరుపుతున్నదని సోమవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఇవన్నీ వదంతులేనని పేటీఎం వెల్లడించింది. మరోవైపు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అలాంటిదేమీ లేదని సోమవారం రాత్రి పొద్దుపోయాక బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ)కి సమాచారమిచ్చింది. ఈ వ్యవహారంపై బీఎస్ఈ వివరణ కోరడంతోనే పైవిధంగా జియో ఫైనాన్షియల్ స్పందించింది. అయితే ఈ ఊహాగానాల మధ్య సోమవారం ట్రేడింగ్‌లో జియో ఫైనాన్షియల్ షేర్ విలువ 14 శాతం పుంజుకొని రూ.289 వద్ద ముగిసింది. ఇక ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం మార్కెట్ విలువ రూ.20,000 కోట్లకుపైగా(దాదాపు 43 శాతం) హరించుకుపోయింది.
ప్రస్తుత పరిణామాలపై పేటీఎంతో మాట్లాడుతున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం దేశీయ అధిపతి పరాగ్ రావు తెలిపారు. చాలా ఏండ్లుగా పేటీఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కలిసి పేమెంట్స్ ఎకోసిస్టమ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రావు పైవిధంగా చెప్పుకొచ్చారు. అయితే ఏం జరుగుతున్నదన్నది లోతుగా తమకు తెలియదన్న ఆయన వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలావుంటే సోమవారం జియో ఫైనాన్షియల్తోపాటు పేటీఎం వ్యాలెట్‌ను కొనుగోలు చేసే రేసులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చినట్టు తెలిసిందే.
పేటీఎం సంక్షోభం నేపథ్యంలో పెద్ద ఎత్తున దాని ప్రత్యర్థి సంస్థల యాప్‌లు డౌన్లోడ్ అవుతున్నాయి. పేటీఎం యూజర్లు ఇతర పేమెంట్స్ యాప్‌ల వైపు చూస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కేవలం నాలుగు రోజుల్లో 10 లక్షలకుపైగా డౌన్లోడ్స్ జరిగినట్టు మార్కెట్ గణాంకాలనుబట్టి తెలుస్తున్నది. క్రితంతో పోల్చితే ఇది సుమారు 50 శాతం అధికమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) ఆరా తీస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆర్బీఐ నుంచి దాని నివేదికను కోరినట్టు మంగళవారం తెలియవచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా? అన్న కోణంలో ఈడీ, ఎఫ్ఐయూలు చూస్తున్నాయి. అయితే తాము ఏ తప్పూ చేయలేదని చెప్తున్న పేటీఎం.. తమపై ఏ రకమైన దర్యాప్తులూ జరగడం లేదని సోమవారం స్పష్టం చేసినది తెలిసిందే. కానీ మంగళవారం ఈ ఇష్యూపై ఈడీ, ఎఫ్ఐయూలు ఆరా తీస్తున్నట్టు రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నది.